పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

Mar 6,2024 21:58
ఫొటో : పొగాకును పరిశీలిస్తున్న అధికారులు

ఫొటో : పొగాకును పరిశీలిస్తున్న అధికారులు
పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను బుధవారం వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌, బోర్డు అదనపు మార్కెటింగ్‌ అధికారి దామోదర్‌, అధికారులు, రైతులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేలాన్ని ప్రారంభించారు. మూడు ప్రాతాల నుండి 18పొగాకు బేళ్లను వేలంలో ఉంచారు. 12 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. అన్ని బేళ్లు కిలో రూ.230 ధర పలికాయి. అనంతరం వేలం నిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంపెనీ వారు రూ.5 నుండి రూ.20లకు పెంచేవారు ఈ ఏడాది రూ.30 పెంచారన్నారు. అలాగే ప్రతేడాది రైతులు పొగాకు సాగును పెంచుకుంటూ పోతున్నారని, ఒక ఏడాది 4 మిలియన్‌ కేజీలు పొగాకు కొనుగోళ్లకు అనుమతి ఇవ్వగా, మరో ఏడాది 5 మిలియన్లు, ఈ ఏడాది 9.3 మిలియన్‌ కేజీలు పొగాకు పంటను పండించారన్నారు. రైతులు పొగాకు పంటను విపరీతంగా సాగు చేయటం వల్ల నష్టపోయే అవకాశం ఉందన్నారు. పొగాకు రైతులకు కావాల్సిన పలు సౌకర్యాలు, ఇన్‌పుట్స్‌ బోర్డు కల్పిస్తుందన్నారు. బోర్డు రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతుందని వారికి ఏం అవసరమో అందిస్తుందన్నారు. గతంలో తుపాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు బోర్డు వడ్డీ లేని రుణాలు రూ.30కోట్లు అందించిందని తెలియజేశారు. పొగాకు సూర బయట రూ.20 నుండి రూ.30లకు వ్యాపారస్తులు కొనుగోలు చేయగా, బోర్డులో రూ.100 సగటు ధర వచ్చేలా కృషి చేశామని తెలిపారు. మూడేళ్ల నుండి పొగాకు సగటు ధర రూ.90 ఇచ్చామని తెలియజేశారు. గత ఏడాది రైతులు పంటకు నీళ్లు కట్టేందుకు సబ్సిడీ ద్వారా పైపులు అందించామని, పొగాకు రైతు అకస్మాత్తుగా మరణిస్తే ఇన్సూరెన్స్‌ను రూ.2లక్షల నుండి రూ.5లక్షలు పెంచామని, బ్యారెన్‌ ఇన్సూరెన్స్‌ను రూ.2లక్షల నుండి రూ.6లక్షలకు పెంచామన్నారు. రైతు బోర్డులో అమ్మిన పొగాకు నగదు గతంలో 11 రోజులకు ఖాతాల్లో జమ కాగా, ప్రస్తుతం 8 రోజులకు రైతుల ఖాతాల్లో జమవుతుందన్నారు. డిమాండ్‌ ఉందని అధిక ధరలు పెట్టి బ్యారెన్‌లు లీజుకు తీసుకోవడం, పంట ఎక్కువ పండించడం వల్ల రైతులు నష్టపోతారన్నారు. బోర్డుకు 6.4మిలియన్‌ కేజీలు అనుమతి ఇచ్చిందని అంతవరకు పండిస్తే ధరలు ఉంటాయన్నారు. ఒక్కో బ్యారెన్‌కు 3650 కేజీలు పొగాకు అమ్ముకునేందుకు అనుమతి ఉందన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పొగాకు బోర్డు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య మాట్లాడుతూ మార్కెట్‌ ధరలు చూస్తే రైతులు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. అధిక ధర కేజీ 230 రూపాయలకు కొనుగోలు చేశారని, ఏడాదిలో గ్రేడ్‌ ఎక్కువగా ఉంటుందని అత్యల్ప ధర ఎంత ఉంటుందో తెలియదన్నారు. గతేడాది కేజీ రూ.280 అధిక ధర పలుకగా ఈ ఏడాది ఆ ధరలు ఉండవని రైతులు ఆందోళన చెందుతున్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50శాతం ఇవ్వాలన్నారు. గతంలో కంటే ఈ ఏడాది అన్ని ఖర్చులు పెరిగాయన్నారు. అధిక ధర రూ.350, సగటు ధర రూ.300 ఉండాలన్నారు. రైతులు ఎక్కువ పంటను పండించారని బోర్డు అధికారులు అంటున్నారని గతంలో ఎంత పండిస్తే అంత కొనుగోలు చేయడంతో రైతులు ఈ ఏడాది పొగాకు పంటను అధికంగా సాగు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని సగటు ధర రూ.300 వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ వేలంలో జిల్లా కౌలు రైతుసంఘం నాయకులు లక్ష్మీపతి, లక్కు ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️