పొర్లుదండాలతో వినూత్న నిరసన

Jan 5,2024 20:50

 ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :  మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికుల సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా తమ సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆలోచించాలని దేవునికి మొక్కుకొని పనులు జరిగిన తర్వాత మొక్కులు తీర్చుకుంటామంటూ పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఆప్కాస్‌ విధాన కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ వర్కర్లందరికీ హెల్త్‌ అలవెన్స్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, పారిశుధ్య కార్మికులు చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేషు, నాగవంశం మల్లేసు, బంగారు రవి, నిర్మల ఇప్పలమ్మ, తదితర కార్మికులు పాల్గొన్నారు.

పాలకొండ : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పొర్లు దండాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్దకు మద్దతుగా టిడిపి పట్టణ అధ్యక్షులు గంట సంతోష్‌ కుమార్‌, ప్రతినిధి బృందం అడపా బాబ్జీనాయుడు, అంపోలు శ్రీనివాసు సుంకరి, అనిల్‌ తదితరులు మాజీ కౌన్సిల్‌ ప్రతినిధులు మద్దతిస్తూ మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలు మున్సిపల్‌ కార్మికులకు తక్షణమే అమలు చేయాలని, శనివారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి జరగబోతున్నదని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పడాల భాస్కరరావు, చింతల సంజీవి, పడాల వేణు, వై.హరిబాబు, టి.వెంకటరమణ, పి.సూరిబాబు, జి.నారాయణరావు, టి.ఈశ్వరకుమార్‌, పి.సాయి, ఎన్‌.రామారావు, రామకృష్ణ, సురేష్‌ తదితరులు నాయకత్వం వహించారు.

సాలూరు: మున్సిపల్‌ కార్మికుల సమ్మె 11రోజుకి చేరింది. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు పొర్లు దండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు మాట్లాడుతూ పట్టణాల్లో అపారిశుధ్యం తాండవిస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ,కనీస వేతనం రూ.26వేలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తీవ్రతరం చేస్తామని చెప్పారు. శనివారం నిర్వహించనున్న మున్సిపల్‌ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు పోలరాజు స్వప్న రవి పాల్గొన్నారు.

➡️