పోటీకి భయపడేలా టిడిపికి మెజారిటీ

Feb 20,2024 20:48

ప్రజాశక్తి- బొబ్బిలి : నియోజకవర్గంలో తమపై ప్రత్యర్ధులు పోటీ చేసేందుకు భయపడేలా టిడిపికి మెజారిటీ వస్తుందని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. కోటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికార వైసిపికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. తమపై ప్రత్యర్థులు పోటీ చేసేందుకు భయపడేలా టిడిపికి మెజారిటీ వస్తుందన్నారు. అలజంగి గ్రామంలో ప్రజలను భయపెట్టి వైసిపికి కొంత మందిని తిరిగి ఆ పార్టీలో చేర్చుకుందన్నారు. చేరికలు సభలో తనపై, అలజంగి టిడిపి నాయకులపై వైసిపి నాయకులు అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు బుద్ది చెపుతారన్నారు. టిడిపిలో చేరిన జానీను, సర్పంచ్‌ భర్త బుజ్జిపై అసభ్యంగా మాట్లాడడం అన్యాయమన్నారు. డబ్బులు ఎర చూపి అలజంగి నుంచి అధిక సంఖ్యలో బయలుదేరించారని, పింఛను, అమ్మఒడి, సంక్షేమ పథకాలు ఆపివేస్తామని వాలంటీర్లతో బెదిరించి తీసుకువచ్చారని చెప్పారు. ఓటు నచ్చిన వారికి వేసుకుని సమావేశానికి రావాలని ఒత్తిడి చేశారన్నారు. అలజంగిలో టిడిపికి అత్యధిక మెజారిటీ వస్తుందన్నారు. గొల్లాది వంతెన నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేద న్నారు. బొబ్బిలి పౌరుషాన్ని, బొబ్బిలి గౌరవాన్ని అపహాస్యం చేసేలా అధికారాన్ని విజయనగరం నాయకులు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ధాన్యం డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. వెంగలరాయసాగర్‌, పారాది ఆనకట్టు కాలువలు దుస్థితి అద్వాన్నంగా ఉన్నాయన్నారు. ఎరువులు సకాలంలో ఇవ్వడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి నాయకులు తలెత్తుకుని తిరగలేని విధంగా టిడిపికి మెజారిటీ వస్తుందన్నారు. అలజంగి వద్ద తోటపల్లి కాలువకు గండి పడడంతో పంటలు నష్టపోయిన పట్టించుకోలేదన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు రేజేటి బుజ్జి, బి.వెంకట రావు, రెడ్డి ప్రసాద్‌, పి.వెంకటరమణ తదితరులున్నారు.

➡️