పోటెత్తిన పుణ్యగిరి

Mar 9,2024 21:14

ప్రజాశక్తి-శృంగవరపుకోట రూరల్‌  : దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి జాగారం చేసిన భక్తులు శనివారం వేకువజాము నుండే పుణ్యగిరి కొండకు చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శనివారం ఉదయం 9 గంటలు తరువాత జన ప్రవాహం బాగా పెరిగిపోయింది. దీంతో టికెట్‌ కౌంటర్‌, దార గంగమ్మ లోవ, కోటిలింగాల రేవు, పుట్టు దార మొదలగు ప్రాంతాలలో భక్తుల ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడే గంటల తరబడి నిలబడి పోయారు. ముసలి వాళ్లు, చంటి పిల్లలతో వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు.

భక్తుల సేవలో పలు స్వచ్ఛంద సంస్థలు

భక్తులకు పట్టణంలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘాలు భోజనాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు, పుణ్యగిరి వద్ద నిర్మాణంలో ఉన్న కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు భోజన ఏర్పాట్లు చేశారు, పట్టణంలోని పాత వైసిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భక్తులకు పులిహౌర, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేశారు, మండల ఎలక్ట్రికల్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భక్తులకు పులిమోర మజ్జిగ పంపిణీ చేయగా ఆశా దేవి టైర్స్‌ వారు బఠానీ, ఉసిరి, పులిహౌర మొదలైనవి పంపిణీ చేశారు, సుబ్బరామిరెడ్డి సేవా పీఠం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేయగా కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ గేదెల తిరుపతి భక్తులకు మజ్జిగ పులిహౌర పంపిణీ చేశారు, వాసవి క్లబ్‌ యూత్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఉప్మా, మజ్జిగ పంపిణీ చేశారు, రైల్వే టి ఆర్‌ డి ఎలక్ట్రికల్‌ ఉద్యోగులు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేయగా రైల్వే ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఉద్యోగులు అదేవిధంగా రామన్‌ స్కూల్‌, శ్రీ రవితేజ స్కూల్‌ వారు మజ్జిగ పులిహార పంపిణీ చేశారు, ప్రసాదాలు పంపిణీ చేసిన భరత్‌ భక్తులకు విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి భరత్‌ ప్రసాదాలను పంపిణీ చేశారు, ముందుగా తాహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ వద్ద భక్తులకు ఏర్పాటుచేసిన ప్రసాదం, మజ్జిగను ఆయన పంపిణీ చేశారు, కార్యక్రమంలో కోళ్ల లలిత కుమారి, ఇందుకూరి సుధారాజు, సర్పంచ్‌ సంతోష్‌ కుమారి, బీసెట్టి అరుణ, రెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దార గంగమ్మ దేవాలయం ఎదురుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ భరత్‌ భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయవరపు చంద్రశేఖర్‌, లగుడు రవికుమార్‌, గుమ్మడి భారతి, ఇప్పాక త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజూ పోటెత్తిన జనం

నెల్లిమర్ల : రామ తీర్ధం రామ స్వామి దేవస్థానంలో శివ రాత్రి జాతర రెండోరోజు శనివారం కూడా జనం పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా భక్తులు జాగరణలు చేసి రామ తీర్ధం రామస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం రామ కోనేరులో స్నానాలు చేసి తలనీలాలు సమర్పించి రామస్వామి, ఉమా సదాశివ స్వామి, బొడికొండ కోదండ రామ స్వామి ని దర్శించుకున్నారు. అంతకు ముందు రోజుదూర ప్రాంతాల నుంచి రాత్రి వచ్చిన భక్తులు కూడా తెల్ల వారు జామున మొక్కులు చెల్లించి సమీప తోటల్లో వంటలు చేసుకోని స్వంత గ్రామాలకు తరలి వెళ్లారు.

➡️