పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు

Mar 25,2024 21:47
ఫొటో : రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

ఫొటో : రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు
ప్రజాశక్తి-కావలి : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం కావలి పట్టణంలోని పాతవూరులోని మున్సిపల్‌ హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను కావలి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శీనానాయక్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు పక్కాగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలున్న ప్రదేశంలో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటరు తమ ఓటుహక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సహాయక కేంద్రం ద్వారా ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుసుకుని, ఆ పోలింగ్‌ కేంద్రానికి సులువుగా వెళ్లి ఓటు వేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. దాంతో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించామని, వేసవికాలం దృష్ట్యా ఎండ, వడగాలుల నుంచి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతీకేంద్రంలో వికలాంగుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ర్యాంపుల ఏర్పాటు, విద్యుత్‌ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం బిఎల్‌ఒల వద్ద ఓటరు జాబితాలను కలెక్టర్‌ పరిశీలించి, వికలాంగులు, వృద్ధుల ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.కంట్రోల్‌ రూమ్‌లో కలెక్టర్‌ పరిశీలన2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కావలి రెవెన్యూ డివిజన్‌ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. సివిజిల్‌, 1950 కాల్‌ సెంటర్లకు వస్తున్న ఫిర్యాదులపై ఆరాతీసి, వెంటనే పరిష్కరించాలని సూచించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌, ఎఫ్‌ఎస్‌టి, విఎస్‌టి, వివిటి, ఎస్‌ఎస్‌టి బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌వెంట ఆర్‌డిఒ శీనానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రావణ్‌, డిఇ సాయిరాం, సెక్టోరల్‌ ఆఫీసర్‌ వెంకటసుబ్బయ్య, బి.ఎల్‌.ఒ.లు ఉన్నారు.

➡️