పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటరు సహాయ కేంద్రాలు

Mar 23,2024 21:08

ప్రజాశక్తి-శృంగవరపుకోట రూరల్‌ : పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. చిన్నపిల్లల కోసం క్రష్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శృంగవరపుకోట మండలంలో శనివారం ఆమె పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, సెక్టార్‌ అధికారులు, డిటిలు, పోలీసు అధికారులతో స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓటర్లకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు పోలింగ్‌ కేంద్రాల వెలుపల 100 మీటర్ల దూరంలో ఒక ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక్కడ బిఎల్‌ఒలు ఉండి ఓటర్లకు మిగిలిపోయిన ఓటరు స్లిప్పులను అందిస్తారని, అవసరమైన సహకారాన్ని అందజేస్తారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల వెలుపల మాత్రమే రాజకీయ పార్టీల కార్యాలయాలు ఉండేలా చూడాలన్నారు. ప్రహరీగోడ లేని పాఠశాలలవద్ద బారికేడ్లతో రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటేయడానికి వచ్చే బాలింతలు, చిన్నపిల్లల సౌకర్యం కోసం అంగన్‌వాడీ సిబ్బందితో క్రష్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవిని దష్టిలో పెట్టుకొని క్యూలైన్లు, వేచిఉండే చోట నీడ కోసం టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక మోడల్‌ యూత్‌ పోలింగ్‌ కేంద్రం, ఒక మోడల్‌ మహిళా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్దులకు, వికలాంగులకు ఈ ఏడాది ఇంటినుంచే ఓటు చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి, కళాజాతాలను, ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. మోడల్‌ కోడ్‌ ఖచ్చితంగా అమలు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి, కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. బస్సుల కోసం పార్కింగ్‌, స్టాల్స్‌ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కోరారు. అనంతరం ఎస్‌కోట మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించారు. బిఎల్‌ఒలతో మాట్లాడి అక్కడి వసతులపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్‌, ఫర్నీచర్‌, నేమ్‌ బోర్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. పర్యటనలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌, శృంగవరపుకోట నియోజకవర్గ ఆర్‌ఒ పి.మురళీకృష్ణతదితరులు పాల్గొన్నారు.

➡️