పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలి

Mar 3,2024 21:20

ప్రజాశక్తి – సాలూరు : పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన పట్టణంలోని డబ్బివీధి దగ్గరలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశం పోలియోరహిత దేశంగా ప్రకటించడం జరిగిందని, అయితే చుట్టు పక్కల ఆఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ తదితర దేశాల్లో ఇంకా కేసులు వస్తున్నాయని అన్నారు. పోలియో బారిన పడకుండా సార్వజనీన కార్యక్రమం కింద దేశంలో వేయడం జరుగుతుందని చెప్పారు. ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు, పిల్లలకు పోలియో వైరస్‌ సోకకుండా రెండు చుక్కలు వేయించాలని కోరారు. రెండు చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వహిస్తే జీవితం కష్టాల మయమవుతుందన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు వారి జీవితాలు ఆరోగ్యకరంగా, ఆనందకరంగా సాగేందుకు సహకరించాలని కోరారు. పోలియో చుక్కల బూత్‌లతో పాటు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంచార జీవనం గడిపే వారు కూడా పిల్లలకు చుక్కలు వేయించాలని చెప్పారు. మావుడి ఆశ్రమ ఉన్నత పాఠశాల సందర్శనమండలంలోని మావుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు పలు సూచనలు చేసి పరీక్షలు బాగా రాసి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు, పాఠశాల సిబ్బందికి మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ఒత్తిడి వద్దని ప్రశాంతత ముఖ్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా బగాది జగన్నాథ రావు, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా శివ కుమార్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ పద్మావతి, పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️