ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Jan 5,2024 20:02

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నగరంలోని కెఎల్‌ పురం, ఎల్‌బి నగర్‌ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్య ఇస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నగరంలో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు కావడంతో పాటు తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అందరికీ వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములునాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డిఎంహెచ్‌ఒ భాస్కరరావు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారికి అండగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 16 లక్షల 80 వేల రూపాయల విలువగల చెక్కులను బాధితులకు అందించారు. బియ్యాల పేటకు చెందిన భవానికి ఎనిమిది లక్షల రూపాయలు, జొన్నవలసకు చెందిన రవితేజకు రూ.4లక్షలు, కోరుకొండకు చెందిన అప్పారావుకు రూ.1.20లక్షలు, రంగిరీజు వీధికి చెందిన నిరీక్షణకు రూ.2 లక్షలు, గాజులరేగకు చెందిన శ్రీరాములునాయుడుకు రూ.1.60లక్షలు చెక్కులను అందజేశారు.

25వ డివిజన్‌లో గడప గడపకూ..

నగరంలోని 25వ డివిజన్‌ గడపగడపకు మన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన బుక్లెట్‌ లను అందజేశారు. సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, వైసిపి నాయకులు బలివాడ కాశీపతిరావు, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️