ప్రజల బాగు కోసమే సచివాలయ వ్యవస్థ

Feb 29,2024 21:41

 ప్రజాశక్తి-గుర్ల :  ప్రజల బాగోగులు చూడటానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి గ్రామంలోనే పదిమంది సచివాలయ కార్యదర్శులను అందుబాటులో ఉంచారని చెప్పారు. గుర్ల మండలం చింతపల్లి పేట, పాలవలసలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతపల్లి పేట లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల సేవలను అందించడానికి సుమారు 25 మంది ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు అందుబాటులో ఉంచారని చెప్పారు. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాన్ని సుభిక్షం చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మంచి జరిగి ఉంటేనే తమకు అండగా నిలబడాలని కోరారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హయాంలో గ్రామాల స్వరూపాలు మారిపోయాయని అన్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరి ంచేందుకు సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం అందుబాటులో ఉందన్నారు. ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ, ఒక్క చింతపల్లి పేట గ్రామానికే వివిధ పథకాలు, అభివద్ధి కార్యక్రమాల కోసం సుమారు రూ.14 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. అనంతరం నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదలకు రిజిస్ట్రేషన్‌ పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో బి.శాంతి, ఎంపిపి ప్రమీల, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, తహశీల్దార్‌ రమాదేవి, ఎంపిడిఒ వెంకటరమణ, పార్టీ నాయకులు కేవి సూర్యనారాయణ రాజు, జమ్ము స్వామినాయుడు, బంగారునాయుడు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️