ప్రజారోగ్యంతో ఆటలు..!

Dec 24,2023 23:38
సామర్లకోట మండలం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

సామర్లకోట మండలం ఎడిబి రోడ్డు మార్గంలో వికె.రాయపురం-మాధవపట్నం మధ్య ఒక పంట కాలువలోకి సెప్టిక్‌ ట్యాంక్‌ ద్వారా వ్యర్ధాలను వదులుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల కొంతమంది స్థానికులు సెప్టిక్‌ ట్యాంకు నిర్వాహకుల అడ్డుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. అలాగే కాకినాడ సముద్ర తీరం, బీచ్‌కు వెళ్లే ఎడిబి రోడ్డు మార్గంలో అనేకమంది వివిధ వ్యర్ధాలను విచ్చలవిడిగా పారబోస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా హానికర వ్యర్థ జలాలు, రసాయనాలు, ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న వ్యర్ధాలను, సెప్టిక్‌ ట్యాంకుల ద్వారా మల విసర్జనాలను విచ్చలవిడిగా వదులుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యర్ధాలను యథేచ్ఛగా ఎక్కడపడితే అక్కడ వదులు తున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నాదనే విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న హానికర ఫార్మా కంపెనీల వ్యర్ధాలను, వ్యర్థ రసాయన జలాలను కాకినాడ తీరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు పారబోస్తున్నారు. దాంతో ఆయా ప్రాంతాల్లో గాలి, నీరు, వాతా వరణం కలుషితమై తరచూ అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. విషవాయువులు పీల్చ డం వలన దీర్ఘకాలిక రోగాల భారిన పడుతున్నామని కాకినాడ రూరల్‌ మండలానికి చెందిన పెందుర్తి, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఉన్న ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమలకు నిత్యం వందలాది ట్యాంకర్లు ద్వారా ఆయిల్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తుంటారు. ఇవి అక్రమంగా కొన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వ్యర్ధ జలాలను తీరంలో కొన్ని పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వదులుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరూ సంచరించని అర్ధరాత్రి సమయాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. కత్తిపూడి నుంచి కాకినాడ మధ్య జాతీయ రహదారిపై గతంలో ఈ వ్యవహారం ఎక్కువగా జరిగేది. అయితే పోలీసులు తరచూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండడంతో అక్రమార్కులు బీచ్‌ రోడ్డును ఎంపిక చేసుకుని వ్యర్ధాలను విడిచి పెడుతున్నారు. మరోవైపు ట్యాంకర్లను శుభ్రం చేసే సర్వీసింగ్‌ సెంటర్ల ద్వారా వదులుతున్న జలాలు చుట్టుపక్కల కాలువల్లోకి చేరుతున్నాయి. వీటి ద్వారా సముద్రంలోకి నేరుగా వ్యర్ధ జలాలు వెళుతున్నాయి. గతేడాది ఒక పరిశ్రమ నుంచి ఫార్మా వ్యర్ధ జలాలు వదులుతున్నట్లు స్థానికులకు ఫిర్యాదు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించి శాంపుల్స్‌ను సేకరించారు. నిబంధనల ప్రకారం కాలుష్య పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను శుద్ధిచేసి వాటిని వ్యవసాయ, ఇతర అవసరాలకు వాడాల్సి ఉన్నా పలు పరిశ్రమల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. నేరుగా హానికర వ్యర్థాలను బయటకు వదిలేస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. నిరంతరం ఈ వ్యవహారం యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీరంలో వ్యర్థ రసాయనాలు, మల విసర్జన వ్యర్థాల నిర్మూలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️