ప్రజారోగ్య వృద్ధే ప్రభుత్వ ఆశయం : కలెక్టర్‌

Jan 2,2024 21:53

ప్రజాశక్తి – జియ్యమ్మవలస:  ప్రజల ఆరోగ్యం వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జియ్యమ్మవలస మండలం బిజెపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. శిబిరంలోని రోగులకు అందిస్తున్న వివిధ విభాగాల వైద్య సేవలను డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ బి.జగన్నాధం ను అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న తీరు, పరీక్షలను పరిశీలించారు. తొలివిడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య సమస్యలకు అందించిన వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద మెరుగైన వైద్యమందించి ఆరోగ్య ఆంధ్రా దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తారన్నారు. రెండో దశలో కూడా ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు ఇంటింటిని సందర్శించి దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారుల సంరక్షణ తదితర అంశాలపై దృష్టి పెడతారన్నారు. అవసరమైన పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఉచితంగా చికిత్స కోసం పంపిస్తారని వెల్లడించారు. రోగుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, ఆరోగ్య సమస్యలకు ఇచ్చే మందులను పరిశీలించారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కింద నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థిని, విద్యార్థులకు వడ్డించిన ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.శ్రీనివాసరావు, రీసర్వే ఉప తహశీల్దార్‌ శివజగన్మోహన్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌, వైద్యులు డాక్టర్‌ జగదీశ్వర్‌ రావు, స్నిగ, రత్నం, ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : మండలంలోని జోగింపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష( జెఎఎస్‌ -2) కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు మంగళవారం తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్ల వద్ద రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. స్పెషలిస్ట్‌ వైద్యుల కౌంటర్ల వద్ద రోగులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలను పరిశీలించి వారి అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగుల చెప్పే ఆరోగ్య సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకొని తగు చికిత్స అందజేయాలని స్పష్టం చేశారు. ల్యాబ్‌ కౌంటర్‌ వద్ద రక్త పరీక్షలను వాటి నివేదికలను పరిశీలించి హెచ్చు తగ్గులు ఉన్న వారిని పర్యవేక్షించాలన్నారు. వారానికి మించి దగ్గు ఉన్న వారికి క్షయ నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా చేయాలన్నారు. డాక్టర్‌ వైయస్సార్‌ కంటి వెలుగు తనిఖీలను పరిశీలించి కేటరాక్ట్‌ సర్జరీలకు గుర్తించిన వారికి సరైన నిర్దేశం చేయాలని, కళ్ల జోళ్లు అవసరమైన వారి వివరాలు సంబంధిత వైద్య సిబ్బంది పరిశీలనలో ఉండాలన్నారు. దీర్ఘకాలిక రోగాలు, వాటి ఆరోగ్య సూచనలు, లక్షణాలకు సంబంధించి చిత్రాలతో కూడిన ఫ్లిప్‌ చార్ట్‌ను అక్కడ ప్రజలకు సిహెచ్‌ఒ వివరించే విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ వద్ద మందులను, అత్యవసర మందులను పరిశీలించారు. మందులు వినియోగించే విధానాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియ జేయాలన్నారు. జెఎఎస్‌-2లో అందజేసిన వైద్య సేవలను ఆన్లైన్‌ చేయాలన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్‌ను పరిశీలించి, ఆవశ్యకతను గర్భిణులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హెల్త్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి. జగన్మోహనరావు, ఎంపిడిఒ ఎంఎల్‌ఎన్‌ ప్రసాద్‌, వైద్యాధికారి పి.పావని, సర్పంచ్‌ కె.సింహాచలం, స్పెషలిస్ట్‌ వైద్యులు డాక్టర్‌ సంధ్య, డాక్టర్‌ పవన్‌ కుమార్‌, పంచాయతీ సెక్రటరీ పైడిరాజు, సిహెచ్‌ఒ ఎస్‌వి రమణ, స్థానిక పెద్దలు, వైద్య, సచివాలయం,104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : మండలంలో టిటికిపాయిలో జగనన్న ఆరోగ్య సురక్ష ఎంపిపి బి.ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ కె.విజయ పార్వతి, ఎంపిడిఒ కె.గీతాంజలి, వైద్యాధికారి భానుప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : మండలంలోని జీగిరాంలో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించిందని, కావున ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లు సుభాషిని, మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.5 నుండి జగనన్న ఆరోగ్య సురక్షవీరఘట్టం : మండలంలోని 22 గ్రామ సచివాల యాల పరిధిలోని ఈ 5నుంచి రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ డి.శ్వేత తెలిపారు. ఈ మేరకు మంగళ వారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 5న కంబర, 12న కత్తులకవిటి, 19న నీలానగరం, 27న నడిమికెల్ల, ఫిబ్రవరి 6న హుస్సేన్‌ పురం, 13న నడుకూరు, 20నచిదిమి, 27న తలవరం, మార్చి15న చిట్టిపూడివలస, 22న చలివేంద్రి, 30న వీరఘట్టం- 4, ఏప్రిల్‌ 2నకిమ్మి, 16న పనసనందివాడ, 23న రేగులపాడు, మే3న చిన్నగోరకాలనీ, 10న వీరఘట్టం-2, 17న సంత నర్సిపురం, 24న తెట్టంగి, 31న దశమంతపురం, జూన్‌ 4న వండువ, 14న తూడి, 18న వీరఘట్టం-3 సచివాలయాల పరిధిలో కార్యక్ర మాలు నిర్వహించినట్లు తెలిపారు. జెఎఎస్‌ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

➡️