ప్రజావ్యతిరేక బడ్జెట్‌ : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా వ్యతిరేకమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం పాత బస్టాండ్‌ పూలే సర్కిల్‌లో బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, గ్యాస్‌, పెట్రోల్‌, యూరియా వంటి ఎరువులకు రాయి తీలు తగ్గించడం దారుణమని తెలిపారు. అంగన్‌వాడీలు, పంట బీమాకు కోత, ఉపాధి హామీ, పీఎం కిసాన్‌కు పెంపు లేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, పేదలు, రైతులకు సంబం ధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం కోత విధించిందన్నారు. ఆహారం, వంట గ్యాస్‌, పెట్రోలియం, యూరియా వంటి ఎరువులకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదని పేర్కొన్నారు. ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారని తెలిపారు. పిఎం కిసాన్‌, ఉపాధి హామీకి ఎటువంటి పెంపుదల లేదు. గతంలో కేటాయించిన వాటినే కాపీ, పేస్టు చేశారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రామ్మోహన్‌, మనోహర్‌, దస్తగిరి రెడ్డి, అన్వేష్‌, నగర కమిటీ సభ్యులు ఓబులేసు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.

➡️