ప్రజ్ఞా వికాస పరీక్ష విజయవంతం : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-మదనపల్లి స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, విజయభారతి స్కూళ్లలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రజ్ఞా వికాస్‌ పరీక్షకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ తెలిపారు. విజయ భారతి స్కూల్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.సేతు, జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు చేతుల మీదుగా ప్రశ్నాపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ భారతి స్కూల్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సేతు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ప్రజ్ఞా వికాస పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ అంటే విద్యార్థుల కోసం పోరాడే సంఘం మాత్రమే కాదు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నతమైన బాటలో నడిపించే ఒక గొప్ప సంఘంగా అభిప్రాయపడ్డారు. పదవ తరగతి విద్యార్థులు ఏ విధంగా పబ్లిక్‌ ఎగ్జామ్‌ రాయాలో వారికి తెలియజేస్తూ పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలో తెలియజేశారు. యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్‌ నాయుడు మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా చదివితే మంచి మార్కులు సాధించొచ్చు చెప్తూ ఒక ఉన్నతమైన విద్యార్థిగా మారాలంటే ఏ విధంగా చదవులో విద్యార్థులు ఎలా రాణించాలో క్రమశిక్షణతో కూడిన విద్య మనిషికి ఎంత అవసరమో తెలియజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎక్కువ ఆయి ప్రభుత్వ బడులు కళాశాలల ప్రభుత్వ విద్యారంగం కుదేలయ్యిందన్నారు. కావున విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివి మంచి మార్కులు సాధించి ప్రభుత్వ విద్యాలయాలు ప్రయివేట్‌ కార్పొరేట్‌ వాటి కంటే తక్కువ ఏమి కాదని నిరూపించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు జి.కార్తీక్‌, విష్ణు, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వి.రమణ, బావాజాన్‌, పుణ్యవతి, అన్వర్‌ బాషా నాగరాజు, స్వరూపరాణి, మోహన్‌రావు, సొమశేకర్‌ నాయుడు, ముబరక, విజయ, శ్రీరామచంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్‌: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాస్‌ పరీక్ష పదవ తరగతి నమూనాను స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబీర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు అంటే భయం పోవడానికి ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న కార్యక్రమానికి అభినందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు అందరూ సమయస్ఫూర్తితో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని బాహ్య ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు పట్టుదల శ్రద్ధతో పరీక్షలన్నీ రాయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు హరి, గణేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️