ప్రతిభ కొలమానంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు

Dec 24,2023 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : క్రీడాకారుల్లో ఇమిడివున్న ప్రతిభను కొలమానంగా గుర్తించి వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవిందరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి అర్‌సిఎం స్కూల్‌ వరకు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల అవగాహనా చైతన్య ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో లాంఛనంగా పాల్గొని క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయం, మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్‌, వాలీ బాల్‌, కబడ్డీ, టెన్ని క్యాయిట్‌, ఖో ఖో విభాగాల్లో పోటీలను సందడిగా నిర్వహించాలన్నారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వినూత్నంగా క్రీడా పోటీలు నిర్వహిస్తుందన్నారు. క్రీడలు మానసిక దృఢత్వానికి, ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిలను స్ఫూర్తిగా తీసుకొని స్నేహభావంతో మెలగాలన్నారు. ప్రతిభను చాటేందుకు క్రీడాకారులకు మంచి వేదిక ఆడుదాం ఆంధ్ర పోటీలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత ఎస్‌.జయరాం, జిల్లా క్రీడాభివద్ధి అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడు, ఎంఇఒ ప్రసాదరావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వర ప్రసాద్‌, సిహెచ్‌.రత్నాకర్‌, పిసి శ్రీనివాసరావు, శ్రీధర్‌, క్రీడా శిక్షకులు గణేష్‌, రవి, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.26 నుంచి ‘ ఆడుదాం ఆంధ్రా’ సీతానగరం : ఈనెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందని ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంచాయతీల నుండి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది హాజరయ్యేలా చూడాలన్నారు. అలాగే ఇప్పటికే టీములు వేయడం జరిగిందన్నారు. సీతానగరం, బూర్జ, గాదిలివలస, నిడగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల మైదానాల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పిఇటి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంద్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ కోరారు. ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆమె ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్‌ కమిషనర్‌ టి.జయరాం ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా సాగింది. 15ఏళ్లు దాటిన వారంతా ఈ క్రీడల్లో పాల్గొనవచ్చని చెప్పారు. యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. యువకులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జి.పార్వతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

➡️