ప్రధాని మోడీ రాకకు నిరసన

ప్రజాశక్తి-తాడేపల్లి : తిరుపతి వెంకన్న సాక్షిగా తొమ్మిదేళ్ల క్రితం ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు జరగకుండా మళ్లీ అదే తిరుపతికి ఎలా వస్తున్నారని సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు విమర్శించారు. తిరుపతి మోడీ రాకను నిరసిస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి స్వాగతం చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన మోడీని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వంత పాడటం మానుకోవాలని హితలు పలికారు. ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన బిజెపి కౌగిలిలో చేరిందని విమర్శించారు. ఇప్పటికైనా ఆ మూడు పార్టీలు బిజెపితో బంధం విడగొట్టుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, పిఎన్‌ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.సుబ్బారెడ్డి, నాయకులు ఎస్‌.ముత్యాలరావు, కె.బాబూరావు, డి.విజయబాబు, కె.మేరి, డి.యోహాన్‌, సాంబశివరావు, పి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️