ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలి

Dec 30,2023 21:05

ప్రజాశక్తి – మక్కువ:  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 19 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని తప్పుడు ప్రచారం నిర్వహిస్తుందని, చిత్తశుద్ధి ఉంటే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొరను ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మండలంలోని కోనలో రాజన్నదొరకు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌.దానమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, పలువురు కార్యకర్తలు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు టిఎ, డిఎలు పూర్తిగా నిలిచిపోయాయని నేటికీ విడుదల చేయని పరిస్థితి ఉందని అన్నారు. తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తామని సిఎం హామీ ఇచ్చారని, ఆ హామీ నాలుగున్నరేళ్లయినా అమలు చేయలేదని అన్నారు. తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కారంలో చిత్తశుద్ధిలేదని విమర్శించారు. శాంతియుతంగా తమ న్యాయమైన సమస్యలు అడుగుతుంటే ప్రభుత్వం అంగన్వాడీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని యూనియన్‌ ఖండిస్తుందని, వెంటనే న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని, లేకుంటే జరిగే పోరాటాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి రాజ్నదొర స్పందిస్తూ వెంటనే తాను ఈ విషయాలన్నీ లేఖ రాసి తెలియజేస్తానని తెలిపారు. వినతిని అందజేసిన వారిలో అంగన్వాడీ సెక్టార్‌ నాయకులు బి.జ్యోతి, గౌరీశ్వరి, గుండమ్మ, సుశీల, సీత, గిరిజన సంఘం మండల నాయకులు టి.ప్రభాకరరావు, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు.పాలకొండ : అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో గల సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వివిధ ప్రజాసంఘాలు పాల్గొన్నారు. అనంతరం సచివాలయం ఉద్యోగికి వినతి పత్రం అందజేసి సచివాలయం పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఒకరికొకరు సహకారం అందించేలా ఉండాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సాలూరు రూరల్‌ : సచివాలయ, వెలుగు సిబ్బంది, వాలంటీర్లతో తమ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం పూనుకుందని, ఇటువంటి విధానం మంచి పద్దతి కాదని, తోటి ఉద్యోగులుగా మీరు కూడా తమకు సహకరించాలని కోరుతూ మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అంగన్వాడీ వర్కర్లు సచివాలయ సిబ్బందికి వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, యూనియన్‌ నాయకులు ఆరిక నారాయణమ్మ, తిరుపతమ్మ, పుష్ప, జానకీకుమారి, సిఐటియు నాయకులు ఎన్‌వై నాయుడు తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : మండలంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా గ్రామ సచివాలయాల వద్ద సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం పంచాయతీ ఇఒ గేదెల వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు ఎం.సునీత, అంగన్వాడీలు సుజాత, లక్ష్మి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. సీతంపేట : మండలంలో అంగన్వాడీలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా సోమగండి, కుసిమి, సీతంపేట గ్రామ సచివాలయ అధికారులకు అంగన్‌వాడీలు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు కార్యకర్తలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సచివాలయాల ఎదుట ధర్నా చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఎల్విన్‌ పేట, ఇరిడి, డుమ్మంగి, రెల్ల, తాడికొండ, లంబేసు, దుడ్డు ఖల్లు, చెముడు గూడ తదితర సచివాలయాలు ఎదుట అంగన్వాడీ ఉద్యోగులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అలాగే జియమ్మవలసలో అంగన్వాడీలు సచివాలయ ఉద్యోగులకు వినతి అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, కోశాధికారి మండంగి రమణ, నాయకులు పువ్వల మోహన్‌రావు, తిరుపతిరావు, సన్యాసిరావు, ఇరిడి ఎంపిటిసి కడ్రక మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు సుధ తదితరులు ఉన్నారు.వీరఘట్టం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని తలవరం, చిటిపూడివలసలో సచివాలయ కార్యదర్శులకు అంగన్‌వాడీలు వినతులు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.పాచిపెంట : మండలంలోని గురునాయుడుపేట సచివాలయం వద్ద పాచిపెంట ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ సెక్టార్‌ నాయకులు అమ్మాజీ, గౌరీశంకరమ్మ ఆధ్వర్యంలో సచివాలయం సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. కొమరాడ : స్థానిక సచివాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు.. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, నాయకులు జయమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు బి.రాధ ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పట్టణంలోని చినహరిజనపేట సచివాలయం వద్ద స్థానికులతో కలిసి వినతిపత్రం అందజేశారు. . కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.కురుపాం : అంగన్వాడీల నిరవధిక సమ్మె సాగుతున్న నేపథ్యంలో శనివారం వారి పరిధిలో గల సచివాలయంలో వారి హక్కులపై నిరసన తెలియజేసి అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో అన్ని గ్రామ సచివాలయాల్లో అంగన్వాడీలో నిరసన కార్యక్రమానికి అంగన్వాడికి కేంద్రానికి వస్తున్న గర్భిణులు, బాలింతలు, మద్దతుగా పాల్గొన్నారు.

➡️