ప్రమాదకరం విద్యార్థుల ప్రయాణం

Jan 23,2024 21:25

ప్రజాశక్తి కొమరాడ: విద్యార్థుల సౌకర్యాల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని గొప్పలు చెప్పడమే తప్ప క్షేత్ర స్థాయిలో అవి కార్యరూపం దాల్చడం లేదు. కనీసం విద్యార్థులకు సరిపడా బస్సులను కూడా కేటాయించడకపోవడంతో అవస్థలు పడుతున్నారు. బస్సులు కోసం సాయంత్రం నుంచి రాత్రి 8గంటల వరకూ రోడ్లపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదరవుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. మండలంలోని కోటిపాం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ జిల్లాలోని అత్యధికంగా విద్యార్థులున్న పాఠశాలగా ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. మండల నలుమూలలు నుంచి ఈ పాఠశాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పాఠశాలకు విద్యార్థులు వచ్చేందుకు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ప్రమాదకర ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. పాఠశాలకు రావడానికి వచ్చిన తరువాత తిరిగి వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. సాయంత్రం 4.30గంటలకు పాఠశాల పూర్తయిన తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు రాత్రి 8 గంటల వరకు ఆడపిల్లలు రోడ్డుపైనే బస్సులు కోసం నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో పిల్లలు కోసం తల్లిదండ్రులు వేయి కళ్లతో ఇళ్ల వద్ద ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. వయసుకు వచ్చిన ఆడపిల్లలు రోడ్డుపై రాత్రిపూట బస్సులు కోసం నిరీక్షణ చేయడంపై తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోడ్డుపై బస్సులు కోసం నిరీక్షిస్తున్న ఆడపిల్లలను ఆకతాయిలు ఇబ్బందులు పెడుతున్నా కనీసం పాఠశాల ఉపాధ్యాయులు గాని, అధికారులు కానీ మహిళా పోలీస్‌ కాని పట్టించుకునే పరిస్థితి లేదని పదో తరగతి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సు వచ్చిన వెంటనే విద్యార్థులంతా ఒకేసారి ఎక్కడంతో తోపులాట జరుగుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు కిందపడి గాయాలపాలవుతున్నారు. మరి కొంత మంది విద్యార్థులు బస్సులో కూర్చోవడానికి సీట్లు లేక బయట గేటు వద్ద వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు సరిపడా బస్సులు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

➡️