బస్సులన్నీ వైసిపి సభకు తరలింపు.. ప్రయాణికుల ఇక్కట్లు

Jan 27,2024 18:59

ప్రజాశక్తి-విజయనగరం కోట  : సార్వత్రిక ఎన్నిల సమర శంఖారావం మోగించేందుకు ‘సిద్ధం’ పేరిట ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ జిల్లా భీమిలి మండలం సంగివలస సమీపంలో శనివారం వైసిపి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆర్‌టిసి బస్సులన్నింటినీ తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జిల్లాల్లోని విజయనగరం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, డిపోల నుంచి 235 బస్సులను సభకు కేటాయించినట్టు సమాచారం. ఈ సభకు నాయకులను, కార్యకర్తలను తరలించేందుకు ప్రతిమండలానికి ఆర్‌టిసి బస్సులను పంపించింది. విజయనగరం, ఎస్‌.కోట డిపోల నుంచి 100 ఆర్టీసి బస్సులు, పార్వతీపుం డిపో నుంచి 55, పాలకొండ డిపో నుంచి 45, సాలూరు డిపో నుంచి 35 బస్సులను వైసిపి సభకు కేటాయించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి అత్యధిక బస్సులను కార్యకర్తలను తరలించేందుకు వినియోగించడంతో రాకపోకలు సాగించే ప్రయాణికులంతా ఆర్‌టిసి బస్టాండ్లలో గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పటికీ బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. అసలే అరకొర తిరిగే గ్రామీణ ప్రాంతాల బస్సులను ఇలా సభలకు తరలించడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్ని డిపోల నుంచి సభకు బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణీకులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. విద్యార్థులు బస్సులు లేక స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు.

➡️