బాల్య వివాహాలను అడ్డుకోవాలి

Feb 27,2024 23:34

మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు బి.పద్మావతి
ప్రజాశక్తి – వినుకొండ :
బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్‌ ఆఫీస్‌ జాషువా కళా ప్రాంగంణములో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిడిపిఒ బి.అరుణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. బాలలకు సంబంధించిన చట్టాలు, హక్కులు, బాల్య వివాహాల నిషేధం చట్టం 2006, జీవో ఎంఎస్‌ 31, 39 పై అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బాల్యవాహాలు జరగకుండా ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు బి.పద్మావతి మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిగితే అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారికి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్లలో బాలికను పెళ్లి చేసుకున్న మేజర్‌ వరుడికి 20 ఏళ్ల జైలు, 16-18 ఏళ్లలోపు మైనర్‌ బాలికలను పెండ్లి చేసుకున్న వరుడుకి పదేళ్ల వరకూ కఠిన కారగార శిక్ష పడుతుందన్నారు. బాల్య వివాహాల నిరోధక కమిటీలకు చైర్మన్‌గా సర్పంచ్‌, కన్వీనర్లుగా మహిళా సంరక్షణ కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ అధికారులు ఉంటారని చెప్పారు. బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరంతరం పర్యవేక్షణ, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలోకి తిరిగి చేర్పించడం వంటివి చేపట్టామన్నారు. చదువు ద్వారానే ఉజ్వల భవిష్యత్తు ఉందని, సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని వివరించారు. కార్యక్రమంలో ఈపూరు ఎంపీడీవో రంగనాయకులు, ఈపూరు జెడ్‌పిటిసి చౌడయ్య, బొల్లాపల్లి ఎంఈఓ జప్రూల్ల ఖాన్‌, బొల్లాపల్లి ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వై.పద్మావతి, ఈపూరు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సునీల్‌ చౌదరి, ఈపూరు ఏపీఎం రంగారెడ్డి, బొల్లాపల్లి జెడ్పిటిసి బీబీ నాయక్‌ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️