బిజెపి పాపాల్లో వైసిపి, టిడిపికీ భాగం : సిపిఎం

Mar 24,2024 22:28

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌, తాడేపల్లి : మతోన్మాద బిజెపి కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించాలని, సిపిఎం, ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇంధన, నిత్యావసర ధరలు పెంచిన పాపం బిజెపిదైతే దానితో అంటకాగిని వైసిపి, టిడిపి, జనసేన కూడా అందుకు బాధ్యత వహించాలని అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు, తాడేపల్లి పట్టణంలోని నులకపేట రామయ్యకాలనీలో సిపిఎం విస్తృత సమావేశాలు ఆ పార్టీ నాయకులు మొసలి పకీరయ్య, వి.దుర్గారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్ల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని, ఈ విషయాలపై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకు ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని అన్నారు. అప్రజాస్వామ్యానికి, నిరంకుశానికి ఇవి తార్కాణాలన్నారు. దేశ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్న బిజెపి అదే సమయంలో ప్రజల్లో మత చిచ్చు రేపుతోందని విమర్శించారు విభజన చట్టం హామీ ప్రకారం రాష్ట్రానికి రావాల్సి నిధుల్లో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కేంద్ర విద్యా సంస్థలు ఇవేవీ నిర్మాణానికి నోచలేదని అన్నారు. బిజెపి పదేళ్ల పాలనలో పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచారని, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మార్చారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధరల చట్టం హామీ అమలు కోసం ఢిల్లీలో సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న రైతులపైనా అణచివేతకు పాల్పడుతోందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతోందన్నారు. బిజెపిని, దానితో జతకట్టిన పార్టీలను ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపితో సహా రాజకీయ పార్టీలన్నీ రూ.వేలకోట్లు స్వాహా చేశాయని, ఎన్నికల బాండ్లను తిరస్కరించిన పార్టీలు వామపక్షాలేనని చెప్పారు. కేరళలో 18 రకాల నిత్యావసర సరుకులను అక్కడ ప్రభుత్వం తక్కువ ధరకే అందజేస్తుందని, అదే విధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రాష్ట్రం, కేంద్రం ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ మరో చేత్తో వంద రూపాయలు లాగేసుకుంటున్నాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌, కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్నులు విపరీతంగా పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనేక ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసిపి, టిడిపి మద్దతిచ్చాయని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన నరేంద్ర మోడీతో కూటమి కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపిస్తారని టిడిపి, జనసేనను నిలదీశారు. రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని బిజెపికి జగన్‌, చంద్రబాబు ఆక్సిజన్‌ ఇస్తున్నారన్నారు. మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి బిజెపి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతామని గత ఎన్నికలప్పుడు చెప్పిన వైసిపి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతుందని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలని కోరిన ప్రతి ఒక్కర్నీ నిరంకుశంగా అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం అనేక పోరాటాలు చేసిందని, రైతు సమస్యలపైనా, ఇళ్ల పట్టాల కోసం, చేనేత కార్మికుల సమస్యలపైన, వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపైనా నిరంతరం పోరాడుతోందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా ఫోరం, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి సిపిఎం నిరంతరం కృషి చేస్తోందని, దళితులు, బలహీనవర్గాల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలిప్పించడానికి పోరాడిందన్నారు. ప్రజల మధ్య ఉంటూ నిత్యం వారి కోసం పోరాడే సిపిఎం, వామపక్ష పార్టీ, ఇండియా ఫోరం అభ్యర్థులకు ఎన్నికల్లో మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, మంగళగిరి, తాడేపల్లి రూరల్‌ మండల కార్యదర్శులు ఎం.జ్యోతిబసు, డి.వెంకటరెడ్డి, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు యు.దుర్గారావు, పి.ప్రసాదు, సిహెచ్‌.సీతారామాంజనేయులు, వి.సాంబశివరావు, సిహెచ్‌.జనార్ధనరావు, జి.అజరు కుమార్‌, బి.రాంబాబు, ఎస్‌కె బాష పాల్గొన్నారు.

➡️