బెల్లాన భవితవ్యం ఏమిటో?

Jan 11,2024 21:19

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సారి ఎంపి సీటు వదులుకోవాలంటూ నాలుగు రోజుల క్రితమే నేరుగా ఆదిష్టానం తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈసారికి పార్టీ కోసం పనిచేయాలని, తిరిగి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ఏదైనా పదవి కట్టబెడతామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో, ఆ రోజు నుంచి బెల్లాన మౌనంగా ఉంటున్నారు. మరోవైపు మంత్రి బొత్స కూడా బెల్లానను వీలైనంత వరకు ఎచ్చెర్ల నుంచి అవకాశం కల్పించేటట్టు చూస్తున్నారని, అదీ కాకపోతే విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాసరావు వెళ్తే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టడం వంటి ఆలోచన చేస్తున్నారని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. బొత్స ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాల్సివుంది. ఎచ్చెర్లలో అవకాశం ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది పూర్తిగా అధినేత జగన్‌ మనసులో మాటేనని, ఆ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో లేదు కాబట్టి బొత్స చెప్తే అయ్యే పరిస్థితి లేదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల ముందు బెల్లాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆశక్తికర చర్చ నడుస్తోంది. బెల్లానకు చీపురుపల్లి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అందుకే వైసిపి మొదటి ఎన్నికల్లో మంత్రి బొత్స, మాజీ మంత్రి కిమిడి మృణాళినిపై నుంచి పోటీచేశారు. అంతకు ముందు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తిరిగి గత ఎన్నికల్లో బొత్స వైసిపిలోకి రావడంతో వైసిపి అధిష్టానం బెల్లానను పార్లమెంట్‌ స్థానానికి పంపింది. దీంతో, బొత్స విజయం కూడా సునాయాశమైంది. ఈసారి బెల్లానకు రాజకీయ భవిష్యత్తు చూపకుండా బొత్స ఎన్నికల్లో దిగితే పరిమాణాలు ఎలా ఉంటాయో అన్న ఆశక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఈనేపథ్యంలో ఒక వేళ జెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీకి దిగితే ఆస్థానం బెల్లానకు కట్టబెట్టాలని బలంగా ఆలోచిస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా బెల్లానకు అలా సాయపడితే ఎన్నికల్లో బొత్స సునాయాశంగా ఒడ్డు ఎక్కడంతోపాటు జిల్లాపై మజ్జి శ్రీనివాసరావు హవాకు అడ్డుకట్టవేసినట్టుగా కూడా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు టిక్కెట్‌ ఉంటుందా? ఊడుతుందా? అన్న సందేహాలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో బెల్లానకు ఆ సీటు కోసం బొత్స ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది.

➡️