బొత్స నోట బెల్లాన మాట

Mar 8,2024 20:57

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లా వైసిపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యుర్థులు యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందా? అంటే ఔననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. వైసిపి తరపున జిల్లా రాజకీయాలను శాశిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిలకపలుకులే ఇందుకు నిదర్శమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత ఉత్కంఠ భరింతగావున్న విజయనగరం ఎంపీస్థానంలో తిరిగి పెదబాబే (బెల్లాన చంద్రశేఖర్‌) పోటీ చేస్తారంటూ నిన్నగాక మొన్న రాత్రి గరివిడి మండలం దేవాడలో చేసిన వ్యాఖ్యలు ఎంపీ అభ్యర్థి ఎవరు? అనేదానిపై దాదాపు క్లారిటీ ఇచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీకి కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే కొనసాగించా లంటూ ఆయన చాలా రోజుల క్రితమే అధిష్టానానికి సూచిన చేసినట్టుగా సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాలో దాదాపు రెండు నెలలుగా రాజకీయ వాతావరణం వేడిక్కెన విషయం విధితమే. జిల్లా పార్టీ సమన్వయ కర్త, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎంపీగా ఆయనకు అవకాశం ఉండవచ్చని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పార్టీ విడుదల చేసిన జాబితాలో విజయనగరం ఎంపీ, మినహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగిలిన స్థానాలన్నింటికీ అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. శ్రీనివాసరావు పేరు బయటకు ప్రకటించకపోయినప్పటికీ అభ్యర్థి మాత్రం ఆయననే అని కూడా విస్తృత ప్రచారం సాగింది. ఎంపీగా బెల్లానను తప్పిస్తే, అందుకు తగిన అవకాశం ఇవ్వాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అధిష్టానం దగ్గర గట్టిపట్టేపట్టారట. అంతకీ శ్రీనివాసరావును ఎంపీగా పంపాలనుకుంటే, జెడ్‌పి పీఠం బెల్లాన చంద్రశేఖర్‌ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని మంత్రి ప్రతిపాదన చేసినట్టుగా చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరావు జెడ్‌పి పీఠాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్తగా తలనొప్పులు లేకుండా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా సిట్టింగ్‌లనే ఉంచాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో శ్రీనివాసరావును వైసిపి ఉత్తరాంధ్ర డిప్యూటీ సమన్వయకర్త బాధ్యత అప్పగించారని చర్చనడుస్తోంది. మరోవైపు మంత్రి బొత్స తాను కూడా తిరిగి చీపురుపల్లి నుంచే పోటీచేస్తానని క్లారిటీ ఇవ్వడంతో ఆయన అనుయాయుల్లో జోష్‌ నెలకుంది. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే అభ్యర్థుల జాబితా అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

➡️