భరత్‌ను గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి

మాట్లాడుతున్న వైసిపి నేత వైవి.సుబ్బారెడ్డి

ప్రజాశక్తి-అనకాపల్లి

వైసిపి అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తా తీసుకోవాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రావు గోపాలరావు కళాక్షేత్రంలో సోమవారం జరిగిన అనకాపల్లి సిద్ధం సభ, నియోజకవర్గ వైసిపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు రాపట్టుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల ఆటలు సాగనివ్వరాదన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అంటే జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత ఇష్టమని, అందుకే ఆయనకు డిప్యూటీ పదవి ఇచ్చి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అప్పగించారని పేర్కొన్నారు. ఆయనకు సమచితస్థానమే లభిస్తుందన్నారు. మంత్రి అమర్నాథ్‌ రానున్న ఎన్నికలు పెత్తందారులకు, పేదవాడికి మధ్య జరిగే యుద్ధమని, ఇందులో ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎంపీ బివి.సత్యవతి, నియోజకవర్గ సమన్వయకర్త భరత్‌కుమార్‌, పార్టీ నాయకులు దందులూరి దిలీప్‌ కుమార్‌, మందపాటి జానకిరామరాజు, బొడ్డేడ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️