భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం

Feb 29,2024 23:20

ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలు వందశాతం అమలు చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఏమి ఇచ్చారో చెప్పాలన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పటికే అమలవుతున్న పథకాలను 1214 మెమో ద్వారా నిలిపేశారని, ఇది ఎంతవరకు న్యాయమో సిఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి భవన నిర్మాణ కార్మికులను పేదలుగా గుర్తించలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో రూ.300 కోట్ల పెండింగ్‌ క్లైములు పరిష్కారంలో ఉండగా, గుంటూరు జిల్లాలో రూ.10 కోట్ల పెండింగ్‌ కైయిమ్‌లు పరిష్కారంలో ఉన్నాయన్నారు. పేదల పక్షాన ఉండేట్లయితే తక్షణమే జగన్మోహన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లు పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్‌ బీమా భవన నిర్మాణ కార్మికులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి దానిద్వారా అమలవుతున్న 15 రకాల సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. తమకు ఎలాంటి మేలూ చేయని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపటానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో డొంక రోడ్డు యూనియన్‌ నాయకులు దీవెనరావు, గాబ్రియేలు, గుంటూరు తూర్పు కమిటీ నాయకులు ఖాసింవలి, కోటేశ్వరరావు, నికల్సన్‌, ఎస్కే భాషా, టి.శ్రీను పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నాచౌక్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో రెండ్రోజులుగా చేపట్టిన రిలేదీక్షలు గురువారం ముగిశాయి. రెండోరోజు దీక్షలను ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.ఏడుకొండలు కార్మికులకు పూలమాలవేసి ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల్లో అనేక నిబంధనల పేరిట ఇసుక తవ్వకాలు నిలిపివేశారని, ఆ సమయంలో భవనిర్మాణ కార్మికులు పనుల్లేక ఇతర రాష్ట్రాలకు వలసెళ్లారని, అక్కడ అనేక మోసాలకు గురయ్యారని గుర్తు చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికులు అనేక పోరాటాలు చేసి 1996లో సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీనిని పునరుద్ధరించడంతోపాటు బోర్డు నిధులను తిరిగి ఇవ్వాలని కోరారు. కార్మికులను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబీకులు ఎన్నికల్లో తనగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దీక్షల్లో కె.సురేష్‌, బి.కొండలరావు, ఎ.ఆంజనేయులు, కె.ఆంజనేయులు, సిహెచ్‌.చిన్నఏసు, సైదులు, దానియేలు కూర్చున్నారు. అనంతరం డిఆర్‌ఒ వినాయకంకు వినతిపత్రం ఇచ్చారు.

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : పట్టణంలోని అన్నాబత్తుని పురవేదిక వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. సంఘం గౌరవాధ్యక్షులు షేక్‌ హుస్సేన్‌వలి మాట్లాడుతూ రూ.2 వేల కోట్ల సంక్షేమ బోర్డు నిధులను దారిమళ్లించడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సిఐటియు జిల్లా నాయకులు కె.బాబుప్రసాద్‌ మాట్లాడుతూ వివాహా కానుక, ప్రసవ కానుక, పిల్లలకు స్కాలర్‌షిప్స్‌, కార్మికులకు టూల్స్‌ కిట్స్‌, ప్రమాదం జరిగి పనిచేయ లేకపోతే జీవన భృతి, స్కిల్‌ డెవలప్మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలు, సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉన్నా ఇవ్వడం లేదని విమర్శించారు.

➡️