భారత స్వాతంత్య్ర సమర అమరవీరుల 96వ వర్ధంతి సభ

బాపట్ల : భారతదేశ స్వాతంత్య్రం కోసం నవ్వుతూ ఉరికంభాన్ని అధిరోహించిన రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ ధన్యులు అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ కొనియాడారు. మంగళవారం ఉదయం సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ ల 96 వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్వాతంత్య్రం కోసం హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ అనే విప్లవ సమస్థను స్థాపించారని వివరించారు. ఆయుధ సంపత్తి కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తమ ఖజానాలో దాచటానికి తీసుకు వెళుతున్న ధనాన్ని ఉత్తరప్రదేశ్‌ లోని కాకోరి స్టేషన్‌ దగ్గర రైలు దోపిడీ చేసి హస్త గతం చేసుకున్నారన్నారు. ఈ కారణంగా రాంప్రసాద్‌ బిస్మిల్‌ ను గోరఖ్‌ పూర్‌ జైల్లో అష్ఫాఖుల్లాఖాన్‌ ను ఫైజాబాద్‌ జైలులో 19 డిసెంబర్‌ 1927 వ తారీఖున ఉరితీశారని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ … అష్ఫాఖుల్లా ఖాన్‌ దేశ స్వాతంత్రాన్ని ప్రాణాలకన్నా మిన్నగా భావించిన త్యాగమూర్తి అన్నారు. సర్వమత సామరస్యాన్ని కాంక్షించిన మానవతామూర్తి అని ప్రశంసించారు. మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ … బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఇద్దరూ హిందీ ఉర్దూ భాషల్లో గొప్ప కవులని ఎన్నో దేశభక్తి గీతాలు రచించి యువతలో స్ఫూర్తి నింపారని తెలియజేశారు. ఈ సభలో ఆదం షఫీ ఎన్‌.కృష్ణ, ఎం.జాకబ్‌, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీనివాసమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, తదితరులు కలిసి రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లాఖాన్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

➡️