భూయజమానులకే పరిహారం..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఖరీఫ్‌లో పంట నష్టపోయిన కౌలురైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. పంటనష్టం నమోదులో 90 శాతం భూయజమానుల పేర్లే నమోదయ్యాయి. దీంతో పెట్టుబడి పెట్టి నష్టపోయిన కౌలురైతులకు పంట నష్టపరిహారం అందే పరిస్థితి లేకుండాపోయింది. రెండు జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకుపైగా రైతులు వరిసాగు చేశారు. మిచౌంగ్‌ తుపాను విరుచుకుపడటంతో ముఖ్యంగా వరిసాగుపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్దఎత్తున పంట దెబ్బతింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు లక్షా 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. పూర్తిస్థాయిలో పంటనష్టం నమోదుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఆ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అభ్యంతరాల స్వీకరణ కోసం సచివాలయాల వద్ద జాబితాలను ప్రదర్శించారు. అభ్యంతరాల పరిష్కారం అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు జాబితా చేరనుంది. ఈ నెల 26వ తేదీకి రెండు జిల్లాల్లో ఎంత పంట నష్టం జరిగిందో స్పష్టత రానుంది. అయొతే సచివాలయాల వద్ద ప్రదర్శించిన జాబితాలు చూసి కౌలురైతులు లబోదిబోమంటున్నారు. పంట నష్టపోయిన వాస్తవ సాగుదారుని పేర్లు జాబితాలో లేకుండాపోయాయి. ఇ-క్రాప్‌ ఆధారంగా పంటనష్టం నమోదు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అదేవిధంగా ప్రక్రియను పూర్తి చేశారు. ఇ-క్రాప్‌లో భూయజమానుల పేర్లే ఉన్నాయి. దీంతో పంటనష్టం నమోదు జాబితాలోనూ అవే పేర్లను అధికారులు చేర్చారు. మిచౌంగ్‌ తుపాను దెబ్బకు పొలాలు నేలనంటి నీటిలో నాని దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.30 వేలకుపైగా రైతులు పెట్టుబడులు పెట్టారు. మూడెకరాలు సాగు చేసిన రైతు దాదాపు రూ.లక్ష వరకూ నష్టపోయాడు. పదెకరాలు సాగు చేసిన రైతులు రూ.మూడు లక్షల వరకూ నష్టపోయిన పరిస్థితి నెలకొంది. పంటనష్టం నమోదులో మాత్రం దెబ్బతిన్న కౌలురైతుల పేర్లు చేరలేదు. దీంతో ప్రభుత్వం అందించే సాయం కౌలురైతులకు అందని ద్రాక్షనే అని తేలిపోయింది. దీంతో కౌలురైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే మీ భూయజమానితో మాట్లాడుకోవాలని చెబుతున్న పరిస్థితి నెలకొంది. భూయజమానిని అడిగితే వచ్చే సీజన్‌లో పొలం సాగుకు కౌలుకు ఇచ్చే పరిస్థితి లేకుండాపోవడంతో కౌలురైతులు మౌనంగా రోదిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం కౌలుచట్టంలో మార్పులు చేసి కౌలురైతులను కోలుకోలేని దెబ్బతీసింది.కౌలు రైతులకు న్యాయం జరిగేదెలా ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూపాయి పెట్టుబడి కూడా భూయజమానులు పెట్టలేదు. అటువంటప్పుడు ప్రభుత్వం అందించే సాయం వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు కాకుండా భూయజమానికి ఇస్తే ఏవిధంగా మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. ఇదే తరహాలో పంట నష్టపరిహారంతోపాటు బీమా సొమ్ము సైతం భూయజమానుల జేబుల్లోకే వెళ్లిపోనుంది. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో కౌలురైతుల ఆత్మహత్యలు పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. దీనికి ప్రధానకారణం పంటను కోల్పోతున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోవడమే. ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే భరోసా వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు లేకుండాపోయింది. రెండు జిల్లాల్లోనూ మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. 80 శాతం సాగు కౌలురైతులే చేస్తున్నారు. దీనిలో పది శాతం మంది కౌలురైతుల పేర్లు కూడా పంటనష్ట నమోదు జాబితాలో చేరలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కౌలురైతుల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. వైసిపి ప్రభుత్వం కౌలురైతులను పక్కనపెట్టి భూ యజమానులకు కొమ్ముకాస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

➡️