భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ప్రజాశక్తి – కడప భూ హక్కు చట్టం 2022ను తక్షణం రద్దు చేయాలని, ఈ నెల 24వ తేదీ వరకు న్యాయవాదులు విధులు బహిష్కరించాలని కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.వి.రాఘవరెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లా కోర్టులోని కడప బార్‌ అసోసియేషన్‌ సమావేశ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ చట్టం వల్ల ప్రజల స్థిరాస్తి హక్కులకు భంగం వాటిల్లుతుందని సమావేశంలో సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ న్యాయవాదులు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా ఆస్తి హక్కులను నిర్ణయించే అధికారాన్ని సివిల్‌ కోర్టు పరిధి నుంచి తీసేసి రెవెన్యూ అధికారులను ట్రిబునల్‌ చైర్మన్‌గా పెట్టి వారికి అప్పగిస్తారన్నారు. ఈ ట్రిబునల్‌కు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌, స్పెసిఫిక్‌ రిలీఫ్‌ యాక్ట్‌, లిమిటేషన్‌ యాక్ట్‌ లతో సంబంధం లేకుండా కేవలం సహజ సూత్రాల ఆధారంగా టైటిల్‌ డిసైడ్‌ చేస్తారన్నారు. ఈ సహజ న్యాయ సూత్రాలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి చట్టాలు రూపొం దించలేదన్నారు. ట్రిబునల్‌ వ్యవస్థ ద్వారా ప్రజల ఆస్తి హక్కులు పెత్తందారులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీంతో వారి చేతుల్లో ఈ యాప్‌ పూర్తిగా దుర్వినియోగం అవుతుందన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ చట్టంపై పునరాలవచన చేసి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వివిధ రూపాల్లో ఆందోళనలు ఉద తం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కడప బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పి.ఎస్‌.బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి వై.టి.జె.కెనడీ, సీనియర్‌ న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️