మంత్రి బొత్స కారును అడ్డగించిన అంగన్వాడీలు-

Jan 8,2024 22:07
botsa satyanarayana

 ప్రజాశక్తి – గజపతినగరం  : తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డుకున్నారు. మెంటాడ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సావానికి వెళ్లి వస్తున్న బొత్స కాన్వారును గజపతినగరంలో అంగన్వాడీలు అడ్డుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తొలుతు మెంటాడ వెళ్తుండగా తమకు కలిసే అవకాశం ఇవ్వాలని నాయకులు కోరగా, పోలీసులు నిరాకరించారు. తిరుగుముఖంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో కారు దిగిన బొత్సకు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ఎం.సుభాషిని, సిఐటియు నాయకులు జి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు వినతి అందజేశారు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన మీడియాపైనా, కొందరు నాయకులపైనా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ జీతం సమస్య తప్ప మిగతా డిమాండ్లన్నీ పరిష్కరించామని అన్నారు. ఇంకా తమతో చర్చించేందుకు వస్తే తాము సిద్ధమని తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ జీతం సమస్య ప్రధానంఉందనీ, దాన్ని పక్కన పెట్టి మిగతా వాటిని పరిష్కరించామని చెప్పడం సరైనది కాదని అన్నారు. దీంతో ఆయన ఐదేళ్లకొకసారి జీతాలు పెంచుతాం గానీ ఇప్పుడు పెంచబోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులం కాని తమపై ఎస్మా ప్రయోగించడం, సంక్షేమ పథకాలు తీసివేయడం సరైనది కాదని అంగన్‌వాడీలు ఆవేదన చెందారు. ధరలు విపరీతంగా పెంచి జీతాలు పెంచక పోతే బతకడం ఎలాగని ప్రశ్నించారు. సమ్మె విరమించబోమనీ తేల్చి చెప్పారు. మళ్లీ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ఫలానా ఇంత జీతం ఇస్తామని ప్రకటించాలని కోరారు. వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో తమ జీతం పెంపుపై ఏమైనా చేర్చారా అంటూ ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇవ్వలేదు. పరిష్కారం దిశగా ఆయన మాట్లాడకపోవడంతో సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నారాయణమ్మ, త్రివేణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

➡️