మందకొడిగా రబీసాగు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో రబీసాగు మందకొడిగా సాగుతోంది. ఖరీఫ్‌లో ఏర్పడిన నీటిఎద్దడే ఇందుకు కారణమని అటు రైతులు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, రాగులు, పెసలు, మినుములు తదితర పంటల సాధారణ విస్తీర్ణం 1,72,710 ఎకరాలు. ఇందులో ప్రధానంగా ముఖ్యంగా సాగునీటి సదుపాయం ఉన్నచోట 75వేల ఎకరాల్లో వరి, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15వేల ఎకరాల్లో చెరకు, 5వేల ఎకరాల్లో రాగులు, 5వేల ఎకరాల్లో నువ్వులు సాగుకావాల్సివుంది. ఇంకా అనేక పంటలు సాగు కావాల్సివుంది. కానీ, ఇప్పటి వరకు అన్నిరకాల పంటలు కలుపుకుని కేవలం 37,925 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. వరి నాట్లు ఒక్క ఎకరాలనూ పడలేదు. మొక్కజొన్న 10వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. మిగిలిన పంటల సాగు తీరు కూడా తక్కువగానే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 48,182 ఎకరాల్లో పంటల సాగు పూర్తైనట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. సుమారు 2వేల ఎకరాల వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఏడాది 1,58,687 సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ సమయానికి వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఎకరాలోనూ నాట్లు పడలేదు. వాస్తవానికి అక్టోబర్‌ నుంచే జిల్లాలో రబీ సీజన్‌ మొదలవుతుంది. కోత దశలోవున్న వరిలోనే మినుములు, పెసలు తదితర అపరాలు అంతరపంటలగా వేస్తారు. కోత పూర్తికాగానే రాగులు, జొన్నలు తదితర పంటలు వేస్తారు. సీజన్‌ ప్రారంభంలో తీవ్ర నీటి ఎద్దడికి తోడు మండుతున్న ఎండల వల్ల పంటల సాగు ప్రారంభానికి నోచుకోలేదు. తీరా నవంబర్‌లో కాస్త వర్షాలు పడి సాగుకు సిద్ధమయ్యే సమయానికి మిచౌంగ్‌ పేరిట వచ్చిన తుపాను అతి వృష్టితో ఇబ్బందులకు గురిచేసింది. ఈనేపథ్యంలో జిల్లాలో రబీ పంటల సాగు మందకొడిగా సాగుతోంది. మరోవైపు తుపాను కారణంగాను, తొలిదశలో నీటి ఎద్దడి కారణంగాను పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా రబీ పంటల సాగు తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

➡️