మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి

Dec 8,2023 20:33

  ప్రజాశక్తి-విజయనగరం  :  మొదటి విడత నాడు -నేడు కింద చేపట్టిన పనులన్నిటినీ డిసెంబర్‌ 21 న మెగా లాంచింగ్‌ చేయనున్నారని, ఈ లోపల స్కూల్‌ మెయింటెనెన్సు ఫండ్‌ నుండి ఫినిషింగ్‌ పనులన్నిటినీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. నాడు నేడు కింద తొలి విడత లో 840 పాఠశాలలను పూర్తి చేసామని, ఆ పనులలో అదనపు భవనాలతో పాటు టాయిలెట్స్‌ , తాగు నీరు, చిన్న చిన్న మరమ్మత్తులు, తదితర అభివృద్ధి పనులు చేపట్టామని, వాటన్నిటినీ డిసెంబర్‌ 21 న ప్రారంభించాలని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం లో నాడు నేడు పనుల పురోగతిపై ఎంఇఒలు, ఇంజినీర్లతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రివాల్వింగ్‌ ఫండ్‌ కోసం వివరాలను వెంటనే అప్లోడ్‌ చేయాలని, ఈ నెల 20 తర్వాత నిధులు విడుదల అవుతాయని తెలిపారు. రెండవ దశ -బి కింద 700 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించడానికి అంచనాలను వారం లోగా పంపించాలని తెలిపారు. రెండో దశలో మొదటగా అంగన్వాడీ కేంద్రాలను పూర్తి చేయాలని, తదుపరి అదనపు తరగతి గదులు, మేజర్‌, మైనర్‌ మరమ్మత్తులను, కిచెన్‌ షెడ్లను చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండేలా ఎంఒఒలు చూడాలని, ఏజెన్సీలకు గట్టి వార్నింగ్‌ ఇవ్వాలని, వెంటనే ఈ విషయంపై స్కూల్స్‌ లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇటీవల కాలంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ధర్నాలు చేస్తూ పాఠశాలలలోని లోపాలతో కూడిన జాబితాను అందించారని, ముఖ్యంగా ఎండిఎం, టాయిలెట్స్‌, తాగు నీరు, పారిశుధ్యం, సబ్జెక్టు టీచర్స్‌ తదితర అంశాలపై విజ్ఞప్తి చేసారని తెలిపారు. ఇంజినీరింగ్‌ సహాయకులు, సంక్షేమ సహాయకులను చైతన్యం చేసి అన్ని పాఠశాలలలో మౌలిక వసతులపై ఎంఇఒలు దృష్టి పెట్టాలని సూచించారు. సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేయాలని తెలిపారు. 10 వ తరగతి కోసం 100 రోజుల ప్రణాళిక తయారు చేయాలని, 10 పరీక్షల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో శత శాతం ఫలితాలు వచ్చేలా చూడాలని, ముఖ్యంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో తప్పనిసరిగా 100 శాతం ఫలితాలు రావాలని అన్నారు. సమావేశంలో డిఇఒ లింగేశ్వర రెడ్డి, ఐసిడిఎస్‌ పీడీ శాంత కుమారి, ఎంఇఒలు, ఎఇలు పాల్గొన్నారు.

➡️