మన్యం బంద్‌ విజయవంతం

Mar 10,2024 21:20

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు 100శాతం గిరిజనులకే కేటాయించాలని, జిఒ 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, స్పెషల్‌ డిఎస్‌సి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని తదితర సమస్యలపై ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఆదివారం చేపట్టిన మన్యం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులు ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె.అవినాష్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో, ఐసిడిఎస్‌ నియామకాల్లో గిరిజనేతరులతో భర్తీ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6100 డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల్లో 1025 పోస్టులు గిరిజన సంక్షేమ శాఖకు కేటాయిస్తే రాష్ట్ర మొత్తం ఐటిడిఎ పరిధిలో 517 టీచర్‌ పోస్టులు నోటిఫై చేశారని అన్నారు. ఇందులో కేవల 38 టీచర్‌ పోస్టులు ఆదివాసీలకు కేటాయించారని తెలిపారు. ఆదివాసీ ప్రాంతంలో ఐదు శాతం నివాసం ఉన్న గిరిజనేతరులకు 95శాతం నివాసం ఉన్న ఆదివాసీలకు ఐదు శాతం పోస్టులు కేటాయించిందన్నారు. జగన్‌ ప్రభుత్వం చర్యల వల్ల ఆదివాసీ యువత భవిష్యత్తు నాశనం కాబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం తక్షణమే జిఒ 3కు చట్టబద్ధత కల్పించుట కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మాతృభాష వాలంటీర్లు రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కోశాధికారి మండంగి రమణ, నాయకులు పి.మోహన్‌రావు, సన్యాసిరావు, శంకర్రావు, కుక్కిడి సర్పంచి బి.రాజారావు, సవర భాషా వాలంటీర్ల జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు ఉన్నారు.కురుపాం : గిరిజన హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పువ్వల తిరుపతి రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర మన్యం బంద్‌ పిలుపుమేరకు మండల కేంద్రానికి సమీపంలో గల మూలు గూడ జంక్షన్‌ వద్ద గిరిజన సంఘ నాయకులు, విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్‌ షెడ్యూలు ఏరియాలో గల 1500 ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ చేర్చాలని, ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ ఇవ్వాలని, డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండంగి శ్రీను, సిఐటియు నాయకులు జి. వెంకటరమణ, గిరిజన సంఘం మండల నాయకులు పువ్వల రమేష్‌, మండంగి వెంకట్రావు, తాడంగి రామారావు తదితరులు పాల్గొన్నారు.మొండెఖల్‌లో…మండలంలో మన్యానికి ముఖ కేంద్రంగా ఉన్న మొండెంఖల్‌లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన మన్యం బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్‌కు విద్యార్థి, కార్మిక, ఉపాధ్యాయ, వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఉలక వాసు ,ఆరిక కోరా, రాజేష్‌, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. సాలూరురూరల్‌ : మండలంలోని మామిడిపల్లిలో జరిగిన మన్యం బంద్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో గిరిజన సంఘ నాయకులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సీదరపు అప్పారావు మాట్లాడుతూ గిరిజనులకు రక్షణగా ఉన్న జీవో నెంబర్‌ 3ను వెంటనే పునరిద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని, గిరిజన ప్రాంతాల్లో 100శాతం ఉద్యోగాలు ఆదివాసీ గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండలంలో అటవీ బంజరు భూములు సాగు చేస్తున్న గిరిజన పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వంతల సుందరరావు, తాడంగి గాసి, నాయకులు పాంగి బిరుసు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు సాలూరు: జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణ కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యాన విద్యార్ధులు, గిరిజనులు ధర్నా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ నాయకులు అఖిల్‌ కుమార్‌, డివైఎఫ్‌ఐ నాయకులు రాములు,సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన విద్యార్థులు, గిరిజనులు పట్టణ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం బోసు బొమ్మ జంక్షన్‌లో ధర్నా నిర్వహించారు. గిరిజనుల ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.సీతంపేట : మండలంలో ప్రజా సంఘాలు బంద్‌ జయప్రదం చేశాయి. ఆదివారం ఉదయం వ్యాపారులు, దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు, దుకాణాలు మూసివేసి బంద్‌కు సహకరించారు. బంద్‌ సందర్భంగా స్థానిక గిరిజన సంఘం కార్యాలయం నుంచి స్థానిక హై స్కూల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు, నాయకులు ఎం.తిరుపతిరావు, జె.శ్రీరాములు, బి.సాయి, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌ సురేష్‌, మాతృభాష విద్యా వాలంటీర్లు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ దొంబు, జిల్లా అధ్యక్షులు ఎస్‌.ఆనందరావు, యుటిఎఫ్‌ గౌరవఅధ్యక్షులు ఆరిక భాస్కర్‌ రావు, జిల్లా కార్యదర్వి పాలక కృషారావు తదితరులు పాల్గొన్నారు. జియ్యమ్మవలస : మండలంలో మన్యం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూరంగ సీతారాం ఆధ్వర్యాన రావాడ రామభద్రపురంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలిపారు. జిఒ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పకగ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బి.మోహన్‌రావు, గిరిజనులు, రైతులు పాల్గొన్నారు. కొమరాడ : ఆదివాసీ హక్కుల రక్షణకై ఆదివారం తలపెట్టిన ఏజెన్సీ బంద్‌ సందర్భంగా కొమరాడలో ర్యాలీ, నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు లక్ష్యము, సుబ్బారావు, వెంకట్రావు, పెద్దసంఖ్యలు గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలను ఓడించాలని మన్యం జిల్లా గిరిజన సంఘ కార్యదర్శి కె.రామస్వామి అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర బంద్‌ సందర్భంగా స్థానిక సుందరయ్య భవనం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీగా వెళ్లి కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా కె.రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీల కోసం ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని, జీవో 3కు చట్టబద్ధత కల్పించి ఆర్డినెన్స్‌ తీసుకురావాలని, ఆదివాసి ప్రాంతాల్లో 100శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, నాన్‌ షెడ్యూలు 1500 ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ చేర్చాలని, ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హెచ్‌.లక్ష్మణరావు, బలరాం, శంకర్రావు, జగ్గన్న, మోహన్‌రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, బి.సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజశేఖర్‌, జిల్లా కార్యదర్శి కె.రాజు పలువురు సంపూర్ణ మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. పాచిపెంట: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి మెయిన్‌ రోడ్డు మీదుగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, సీనియర్‌ నాయకులు సూకూరు అప్పలస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు సిఐటియు, వ్యవ సాయ కార్మికసంఘం, ఆటో సంఘం నాయకులు పోలి రాజు, సురు రామారావు ఆటో కార్మిక సంఘం నాయకులు ఆకుల వెంకటరమణ బంద్‌కు మద్దతు తెలిపారు.

➡️