మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: దేశ ప్రధాని మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మాబు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు శుక్రవారం సంతనూతలపాడులో జరిగిన గ్రామీణ బంద్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంద్‌, సమ్మె విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా సంతనూతలపాడులో మాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి విధానాల వల్ల గత రెండేళ్ల కాలంలో పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు 1,50,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు అడ్డుగా ఉన్నాయని అమలులో వున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్లో రాస్తారోకోను నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌ వి నరసింహం, కరిచేటి హనుమంతరావు, అన్ను సుబ్బారావు, సిఐటీయు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, ఆ సంఘం మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌, జీఎంపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె పెద్దబ్బాయి, మండల కార్యదర్శి కే జయరాం, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మద్దిపాడు ప్రాజెక్టు కార్యదర్శి ధనలక్ష్మి, ఐద్వా మండల అధ్యక్షులు బంకా పద్మ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌: దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరులో సిఐటియూ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులకు, రైతాంగానికి ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక మతతత్వ విధానాలతో పరిపాలన చేస్తోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డి స్వర్ణ, ఏ మున్నా, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జి విశ్రాంతమ్మ, ఎల్‌ రాజమణి, ఎం సరోజ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జి నాగయ్య, ఎం మురళి పాల్గొన్నారు. యర్రగొండపాలెం: దేశ వ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాల పిలుపులో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం రఫీ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయినా రైతు, కార్మికవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, రవణ, ఎం బాలకాశయ్య, ఎన్‌ రాజు, బంగారయ్య, పద్మావతి, రూత్‌ మేరీ, రామకుమారి, సుజాత, వసుంధర, లక్ష్మీబాయి, జయలక్ష్మి, జయ, శ్రీను, ఎన్‌ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️