మరో 5472 చీరలు స్వాధీనం

Mar 21,2024 21:49

అధికారులు స్వాధీనం చేసుకున్న చీరలు.. పరిశీలిస్తున్న అధికారులు (ఇన్‌సెట్‌)
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి ఇండిస్టీయల్‌ ఎస్టేట్‌లోని ఓ గోదాములో అక్రమంగా దాచి ఉంచిన చీరలను ఎన్నికల అధికారులు గురువారం పట్టుకున్నారు. సిఎం జగన్‌ బొమ్మతో ఉన్న 5472 చీరలను ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు పారిశ్రామికవాడలోని గోదాములో వీటిని నిల్వ చేశారనే సమాచారంతో ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీకి వెళ్లారు. గోదాముకు తాళం వేసి ఉండడంతో నిర్వాహకునికి ఎన్నికల అధికారులు పోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారి కెవిఎల్‌ నరసింహారావు తాళాలు పగులగొట్టి తనిఖీ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ఉన్న 114 అట్టపెట్టెల్లోని 5472 చీరలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. వైసిపి నాయకుని దుకాణంలో 1680 చీరలు బుధవారం ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే చీరలు బాక్సులు పట్టుకోవడం గమనార్హం. అయితే తాజాగా పట్టుబడిన చీరలు తనవేనని, విక్రయించేందుకు గోదాములో నిల్వ ఉంచామని సత్తెనపల్లి పట్టణానికి చెందిన వస్త్ర దుకాణ నిర్వాహకుడు భవిరిశెట్టి వేణుగోపాల్‌ ఎన్నికల అధికారులకు చెప్పారు.

➡️