మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రజాశక్తి-మార్కాపురం: భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఎపిఐఐసి చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి కొనియాడారు. రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద జాతీయ రహదారి 565పై నెలకొల్పిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ విగ్రహాన్ని జంకె వెంకటరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్‌ వారితో వీరమరణం చెందిన నరసింహారెడ్డి ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన వర్థంతి రోజున విగ్రహాన్ని మార్కాపురంలో నెలకొల్పడం అభినందనీయ మన్నారు. కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సేవా సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు గుంటక సుబ్బారెడ్డి, గొలమారి శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యురాలు గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, ఎంపిపి పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, వైసిపి మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారత జాతి కోసం అమరత్వం చెందిన రోజు సందర్భంగా ఆయన సంచరించిన గిద్దలూరు మండలం, నరవ గ్రామ సమీపాన గల కొండపై జాతీయ జెండా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ పోకల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులందరూ ప్రాణత్యాగం చేయబట్టి మనం ఈనాడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కమిటీ సభ్యులు గుర్రంకొండ నరసింహులు, బిఎస్‌ నారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, కాశీశ్వరావు, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️