మహిళలు స్వశక్తితో ఎదగాలి

Jan 25,2024 00:34

సభలో మాట్లాడుతున్న అతిథులు
ప్రజాశక్తి-తాడేపల్లి :
మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి స్వశక్తితో ఎదగాలని విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో గతేడాది సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరిగిన కుట్టుశిక్షణ మొదటి బ్యాచ్‌ సభ్యులకు బుధవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తాడేపల్లి మహిళా నైపుణ్య కుట్టు శిక్షణా కేంద్రం ఆర్గనైజర్‌ గాదె సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో ఎంతో కొంత సంపాదించగలిగితే ఆ కుటుంబ సభ్యుల్లో గౌరవం పెరుగుతుందని చెప్పారు. బ్యూటిషియన్‌ కోర్సు, ఎంబ్రాయిడరీ తదితర వాటిల్లో విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో మహిళలు అనేక రకాల వృత్తులు నేర్చుకుని రాణిస్తున్నారని చెప్పారు. ఎంబివికె బాధ్యులు గాయత్రి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రాల ద్వారా మహిళలు సముచిత గౌరవం సమాజంలో పొందుతున్నారని, దానికి తానే ఉదాహరణ అని చెప్పారు. తాడేపల్లి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కూడా అనేక కల్చరల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోలాటం, జానపద నృత్యాలు, చిన్నారులకు డ్యాన్స్‌ శిక్షణ, పేదల విద్యార్థులకు ఉచితంగా టూషన్‌ పాయింట్లు ఏర్పాటు చేసి విజ్ఞానం సుగంధాలు అన్ని ప్రాంతాలకు విస్తరించజేయడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు వివరించారు. శిక్షణా కేంద్రాల ద్వారా నేర్చుకుంటే నైపుణ్యం వస్తుందన్నారు. పట్టుదల, కృషితో ముందుకు సాగాలని కోరారు. అమరావతి ఐకాన్‌ బాధ్యులు యడ్ల బాలకృష్ణ మాట్లాడుతూ అనేక రకాల మోడల్స్‌ వచ్చిన నేపథ్యంలో వారికి మరింత డిమాండ్‌ పెరిగిందని, కుట్టుశిక్షణలో బాగా రాణించాలని కోరారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తాడేపల్లి ప్రాంతంలోని మహిళలకు హిమోగ్లోబిన్‌ రక్తపరీక్షలు త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. రూ.150కే అన్ని రకాల పరీక్షలు చేసే విధంగా రాజశేఖర్‌ ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ అవకాశాన్ని తాడేపల్లి ప్రాంతంలోని మహిళలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాడేపల్లి మాజీ సర్పంచ్‌ డి.శ్రీనివాసకుమారి, వి.దుర్గారావు, ఎస్‌కె నాగూర్‌బి, సుజాత, ఆర్‌ఎంఎస్‌ కాలనీ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, కుట్టుశిక్షణ నిర్వాహకులు వెంకటరత్నం పాల్గొన్నారు.

➡️