మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

Mar 12,2024 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సహకారం చిరస్మరణీయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం రింగ్‌ రోడ్‌ గ్రౌండ్స్‌ లో ఏర్పాటుచేసిన నాలుగో విడత చేయూత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11,094 మంది మహిళలకు 20కోట్ల 80లక్షల12,500 రూపాయలు, మండల పరిధిలో ఉన్న 3,296 మంది మహిళలకు రూ.6.18 కోట్ల రూపాయల మెగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ఒకటో తేదీ కల్లా పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి అందిస్తున్న ఘనత తమదేనన్నారు. అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించామన్నారు. మరోసారి తమకు అవకాశం ఇస్తే పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు అండగా జగనన్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి కెల్ల శ్రీనివాసరావు, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాస్‌ రావు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ,పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైసిపిదేపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జొన్నవలస, మలిచర్ల, సుంకరి పేట ప్రాంత లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను అందించారని అన్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపించి నట్లయితే మిగిలి ఉన్న అందరికీ ఇళ్ల పట్టాలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, జడ్‌పిటిసి సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, ఎంపిడిఒ గంటా వెంకట్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన బాబు జగజ్జీవన్‌ రాం ఆశయాలు భావితరానికి స్ఫూర్తిదాయకమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి జంక్షన్లో బాబు జగజ్జీవన్‌ రావు విగ్రహ ఏర్పాటుకై శంకుస్థాపన చేశారు. ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ దేశానికి ఉత్కష్టమైన సేవలను అందించిన మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన గురుతరబాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️