మహేంద్ర మృతికి కారకులను శిక్షించాలి

Dec 17,2023 00:24 #మహేంద్ర
మహేంద్ర మృతికి కారకులను శిక్షించాలి

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌దొమ్మేరులో దళిత యువకుడు బొంత మహేంద్ర ఆత్మహత్య ఘటనలో నిందితుల ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేశ్‌, కార్యదర్శి జి.రోహిత్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో నిజ నిర్ధారణలో భాగంగా శనివారం వారు మహేంద్ర కుటుంబ సభ్యులు, కొవ్వూరు పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెయింటింగ్‌ పని చేసుకుంటూ వైసిపిలో క్రియా శీలకంగా ఉండే మహేంద్రను అదే పార్టీకి చెందిన ముదునూరు నాగరాజు, బి.సతీష్‌ వైసిపి బ్యానర్‌ను చింపివేశాడని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌లో పెట్టించారని, నవంబర్‌ 13న కొవ్వూరు ఎస్‌ఐ భూషణం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి అవమానకరంగా దూషించారని తెలిపారు. బ్యానర్‌ ఎవరు చంపారో తెలుసుకోకుండా ఆ ఇద్దరి నాయకుల ప్రోద్బలంతో అవమానించడంతో మహేంద్ర పురుగు మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. చాగల్లు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మహేంద్ర మరణ వాంగ్మూలం తీసుకునే సమయంలో మెజిస్ట్రేట్‌ ముందు కాక ఆసుపత్రిలోనే ఒక వైద్యుని ముందు వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. మహేంద్ర చెప్పింది కాక పోలీసులకు నచ్చినట్లు రాసి మహేంద్ర వేలిముద్రలు తీసుకున్నారని, ఈ తప్పుల తడక మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నా తెలిపారు. ఈ కేసు విచారణను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

➡️