మాధవికే మద్దతు

Mar 22,2024 21:17

 ప్రజాశక్తి-డెంకాడ, పూసపాటిరేగ : పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవికే తమ మద్దతని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు ప్రకటించారు. టిడిపి, జనసేన, బిజెపి ఆత్మీయ సమావేశాలను శుక్రవారం డెంకాడలో టిడిపి కార్యాలయంలో, పూసపాటిరేగ మండలంలో మాజీ మంత్రి పతివాడ స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, సీనియర్‌ నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖరరావు, పతివాడ అప్పలనారాయణ, సువ్వాడ రవిశేఖర్‌ మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం టిడిపి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కృషి చేయాలని తెలిపారు. పూసపాటిరేగ మండల నాయకులు పతివాడ తమ్మునాయుడు మాట్లాడుతూ వైసిపి నుంచి జనసేన పార్టీలో చేర్చుకునేటప్పుడు టిడిపి స్థానిక నాయకులకు చెప్పి పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. లేకుంటే కొత్తగా వచ్చినవారి పెత్తనం పెరుగుతుందన్నారు. ఈ సమావేశాల్లో టిడిపి మూడు మండలాల అధ్యక్షులు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.బంగార్రాజు డుమ్మాఆత్మీయ సమావేశానికి టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు డుమ్మా కొట్టారు. బంగార్రాజుతో సహా భోగాపురం మండల నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు. పూసపాటిరేగ మండలానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శులు దంగా భూలోకా, మైలపల్లి సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు ఆకిరి ప్రసాదరావు, రెల్లివలస సర్పంచి భర్త ఈశ్వర్రావు, కనిమెట్ట సర్పంచి ప్రతినిధి గోవిందరావు ఈ సమావేశానికి రాలేదు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతుకు అధిష్టానం నుండి ఎటువంటి హామీ రాకపోవడంతో జనసేనతో ఆత్మీయ సమావేశాలు ఆపాలని బంగార్రాజు నియోజకవర్గంలో నాయకులను కోరినట్లు తెలిసింది. అయితే దానికి డెంకాడ, పూసపాటిరేగ మండలాలకు చెందిన టిడిపి నేతలు నిరాకరించినట్లు సమాచారం. దీంతో సమావేశానికి వెళ్లొద్దని కొంతమందికి బంగ్రారాజు చెప్పినట్లు బోగట్టా.

➡️