మిమ్స్‌ ఉద్యోగులకు అండగా ఉంటాం

Feb 14,2024 21:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మిమ్స్‌ ఉద్యోగుల న్యాయమైన పోరాటం వెనుక తాము ఉన్నామని, న్యాయం జరిగే వరకు పోరాటానికి అండగా ఉంటామని పలువురు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా 19న జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు. బుధవారం స్థానిక ఎన్‌ పి అర్‌ భవనంలో సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ముందుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగులకు సంఘం లేకుండా చేసి గత మూడేళ్లగా ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా నిరంకుశంగా చూసిందన్నారు. ఏడు డిఎలు ఇవ్వకుండా ఉద్యోగులకు అన్యాయం చేసిందన్నారు. అడిగిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు యాజమాన్యం పాల్పడుతోందన్నారు. గత కొద్ది రోజులుగా మిమ్స్‌ వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. సమస్యలను పరిష్కరించాలని అడుగుదామంటే మిమ్స్‌ లో వినేనాధుడే కనిపించడం లేదన్నారు. ఒక వేళ ఎవరైనా అడిగితే బెదిరింపులు, కక్ష సాధింపులకు పాలపడుతోందన్నారు. ఒకవేళ ఎవరైనా అడిగితే బెదిరింపులు, కక్ష సాధింపులు చేస్తూ ముందస్తు నోటీసులు లేకుండా నేరుగా సస్పెండ్‌లు లేదా బదిలీలు చేస్తున్నారన్నారు. సమస్యలపై మాట్లాడినందుకు ఈనెల 1న ఇద్దరు ఉద్యోగులను విధులకు రాకుండా నిలిపివేశారన్నారు. యాజమాన్యం చేపడుతున్న ఈ చర్యలపై ఆందోళన చెందిన ఉద్యోగులు అప్పటినుంచి విధులు బహిష్కరించారన్నారు. సంస్థ చైర్మన్‌ వెంటనే కలుగ జేసుకొని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్‌తో చర్చించి పరిష్కరించాలని కోరారు.వెంటనే నూతన వేతన ఒప్పందం చేయాలని, కక్షసాదింపుల్లో బాగంగా బదిలీ చేసిన ఉద్యోగులకు మిమ్స్‌లోనే డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. 2019లో వేతన ఒప్పందానికై ఉద్యోగులు పోరాడిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని విధుల్లోకి తీసుకోవాలన్నారు. యాజమాన్యం చర్చలు జరిపి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం 19 న జిల్లా వ్యాప్తంగా మిమ్స్‌ ఉద్యోగులు పోరాటానికి మద్దతుగా రాస్తారోకోలు చేపట్టాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఇఫ్టూ నాయకులు అప్పలసూరి, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు వి.లక్ష్మి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు వి.రాములు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.ఆనంద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌, డి వైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హరీష్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె.త్రినాథ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, నాయకులు టివి రమణ, మిమ్స్‌ ఉద్యోగులు పైడిరాజు, సీతం నాయుడు,బంగారు నాయుడు, ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.

➡️