మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడాలి

Mar 11,2024 21:18

 ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు కార్మికులను ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌ అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరసన 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు, కార్మికులకు జనవరి జీతాలు, డిఎ బకాయిలు ఇవ్వకుండా,, వేతన ఒప్పందం చేయకుండా ఇబ్బంది పెడుతోందని అన్నారు. పని చేసిన కాలానికి జనవరి నెల జీతాలు ఇంతవరకు ఇవ్వకపోవడం అన్యాయ మన్నారు. కాబట్టి ప్రభుత్వం, ప్రజ ప్రతినిధులు స్పందించి మిమ్స్‌ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకు వచ్చి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శిబిరానికి విశ్వ బ్రహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనా ప్రసాద్‌, 7వ వార్డు కౌన్సిలర్‌ మైపాడ ప్రసాద్‌, నాయకులు పాండ్రంకి సత్య నారాయణ, కాళ్ళ మహేష్‌ మద్దతు తెలిపారు. శిబిరంలో సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామరావు, ఉద్యోగులు ఎం.నారాయణ, గౌరి,మూర్తి, అప్పల నాయుడు, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

13 మంది అరెస్టు, విడుదల

40 రోజులైనా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న నేపధ్యంలో యాజమాన్యం కుట్రపూరిత వైఖరి అవలంభిస్తోంది. అందులో భాగంగానే మిమ్స్‌ను ముట్టడిస్తా రంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి సోమవారం వేకువ జామున సిఐటియు నాయకులు తమ్మినేని సూర్య నారాయణ, టివి రమణ సహా 13 మంది ఉద్యోగులను అరెస్టు చేయించింది. వారందరినీ పోలీసులు పూసపాటిరేగ పోలీసుస్టేషన్‌కు తరలించి, సాయంత్రం విడిచిపెట్టారు.

➡️