మున్సిపల్‌ కార్మికుల విజయోత్సవ సభ

Mar 6,2024 21:18

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మున్సిపల్‌ కార్మికులు 16 రోజుల సమ్మె పోరాట సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాతపూర్వకంగా ఇచ్చిన హామీల్లో భాగంగా 9 జీవోలు వచ్చాయి. మరో 7 జీవోలు రావాల్సి ఉంది. పారిశుధ్య కార్మికులకు రూ.21వేలు, డ్రైవర్లకు రూ.24,500లు బేసిక్‌ వేతనం అమలు చేస్తూ మార్చి 1 న జీవో నెంబర్‌ 36 ఇచ్చిందని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జగన్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా జగన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ అనారోగ్యంతో మరణించిన తుపాకుల రవణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు కొండ వెలగాడ గ్రామంలో, నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ జీతం పెంచాలని, అధ్యాయన కమిటీ రిపోర్ట్‌ ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కె. రామారావు, నాయకులు శ్రీను, హరిబాబు, లక్ష్మి, శంకర్‌, దుర్గారావు, రాము, తదితరులు పాల్గొన్నారు.

➡️