ముమ్మరంగా వరికోతలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : డెల్టా ప్రాంతంలో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జూన్‌, జులైలో వెదపద్ధతిలో సాగు చేసిన భూముల్లో పంట చేతికి వచ్చింది. గత వారం నుంచి కోతలు ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐదు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా మూడు నుంచి మూడున్నర లక్షల టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో వర్షాభావం, సకాలంలో నీరందని పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు భారీగా తగ్గనున్నాయని తెలిసింది. అనువైన వాతావరణం ఉండటంతో రైతులు కోతలు ప్రారంభించారు. ఇప్పటికే వ్యవసాయ, అర్ధగణాంక, ప్రణాళిక శాఖల అధికారులు పంట కోత ప్రయోగాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. పంటను కోసి నూర్చి అక్కక్కడికక్కడే తూకం వేసి ధాన్యం దిగుబడి అంచనాలను రూపొందిస్తున్నారు. డెల్టాలోని అన్ని మండలాల్లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో వచ్చిన సమాచారం ప్రకారం నీటి ఎద్దడి ఇబ్బంది లేని కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తోందని అంచనా వేశారు. అయితే పొన్నూరు, కాకుమాను మండలాల్లో 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వర్షాభావం, సకాలంలో నీరంకపోవడం, చివరి భూముల్లో పంట ఎదుగుదలలో జాప్యం జరగడం తదితర కారణాల వల్ల ఖరీఫ్‌లో సగటు దిగుబడి కంటే తక్కువ రావచ్చునని అంచనా వేస్తున్నారు. తెనాలి రూరల్‌ మండలంలో దిగుబడి బాగా తక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఖాజీపేట, హనుమాన్‌పాలెం గ్రామాల్లో నీరందక పంట దెబ్బతింది. నీటి ఎద్దడి అధికంగా ఉన్న పెదనందిపాడు, చేబ్రోలు, పెదకాకాని, వట్టిచెరుకూరు తదితర ప్రాంతాల్లో దిగుబడి బాగా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే రైతులు కోసి కుప్పలు వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ఇప్పటికిప్పుడే నూర్పిడి చేయకుండా పొలాల్లో కుప్పలు వేస్తున్నారు. వరికోతలు కోసిన వెంటనే రెండో పంటగా చాలా మంది మినుము, పెసర, శనగ సాగుకు ఉద్యుక్తులువుతున్నారు. నీటి ఎద్దడిలేని ప్రాంతాల్లో జొన్న,మొక్కజొన్నసాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రెండో పంటగా జొన్న,మొక్కజొన్నకు నీరు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు. అయినా అవకాశం మేరకు ఈ పంటలు సాగు చేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కాలువ చివరి భూములకు నీరందకపోవడం, అక్టోబరు నెల మొత్తం వర్షంలేకపోవడం వల్ల చాలా మండలాల్లో వరిపైరు బెట్టకు రావడం వల్ల రెండో పంట కేవలం అపరాలే సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబరులో ఆడపాదడపాగా కురిసిన వర్షాలతో కొన్ని మండలాల్లో వర్షాభావం తాత్కాలికంగా తగ్గినా రెండోపంటకు జనవరిలో నీరు ఇవ్వాలంటే ఇబ్బంది వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వచ్చే వారంనుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీస మద్ధతు ధర గత ఏడాది కంటే స్వల్పంగా పెరిగింది. గతేడాది 75 కేజీల బస్తాకు గ్రేడ్‌ ఏకు రూ.1545 ఉండగా ఈఏడాది 75 కిలోల బస్తా 1652.25 మద్ధతు ధర నిర్ణయించారు. జిల్లాలో 163 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ క్రాప్‌లో నమోదు అయిన రైతుల నుంచి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు.

➡️