ముస్లింల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం :’చమర్తి’

Dec 2,2023 20:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ముస్లిం మైనార్టీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. శనివారం పట్టణ శివారులోని ఓ కల్యాణ మండపంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయులు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ప్రారంభిస్తానని, గద్దెనెక్కి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా, కనీసం కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఉర్దూ పాఠశాలను మూసివేసి, నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని కూడా నియమించకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉర్దూ డిఎస్‌సి నిర్వహించి 1100 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. బైజూస్‌ ట్యాబ్స్‌లో ఉర్దూ పాఠాలు లేకపోవడం అనేది ముస్లిం విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షత కాదా అని ప్రశ్నించారు. రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్‌ తోఫా అందించిందని దానిని కూడా వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం భవనాలు నిర్మిస్తే నేడు వైసిపి ప్రభుత్వంలో దాడులు చేసి భూములు కబ్జా చేస్తుందని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఇమామ్‌లకు రూ.5 వేలు, మొజాంలకు రూ.3 వేలు గౌరవ వేతనం కూడా ఇచ్చిందన్నారు. అనంతరం మైనార్టీ నేతలు జగన్మోహన్‌రాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ ముస్తాక్‌ అహ్మద్‌, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి సీనియర్‌ నాయకులు, జనసేన పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి ముకరం చాన్‌, కార్యకర్తలు, ముస్లిం సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.

➡️