మెడకు ఉరితాళ్లతో నిరసనలు

Dec 29,2023 20:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరింది. విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్రావు, సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ, యూనియన్‌ నాయకులు బి. భాస్కరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్న మీ రుణం తీర్చుకోలేనని, లక్ష రూపాయలు జీతం ఇచ్చినా తక్కువే అని, 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, అందర్నీ పర్మినెంట్‌ చేస్తామన్న ముఖ్యమంత్రి మాట మార్చి అప్కాస్‌లో చేర్చి శాశ్విత బానిసలుగా చేసి నేడు ఉరి తాడు బిగించారని ఆందోళన వ్యక్తం చేశారు.నెల్లిమర్ల : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో ఉరేసుకుని నిరసన తెలిపారు. శుక్ర వారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన చేపట్టిన సమ్మె శిబిరం శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కిల్లంపల్లి రామారావు, ఫెడరేషన్‌ నాయకులు టి.బాబూరావు, బి.హరిబాబు, జె.శ్రీను, బి.రాము, టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి : పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె శిబిరంలో వినూత్నరీతిలో మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు గౌరీష్‌, నాయకులు వాసు, యుగంధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

➡️