మెనూ అమలు చేయకుంటే కఠిన చర్యలు

సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలుపై అడిగి తెలుసుకుంటున్న డిడి

గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కొండలరావు

ప్రజాశక్తి -సీలేరు

విద్యార్థులకు మెనూ తూచ తప్పక అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్‌ ఐ.కొండలరావు హెచ్చరించారు. జీకే వీధి మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జీకే వీధి ఏకలవ్య, గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి భవనాలను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు మెనూ అమలు తీరు తదితర అంశాలపై సిబ్బందితో సమావేశం చర్చించి ఆరా తీశారు. దారకొండ బాలురు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నదీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీలేరులో గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలకు చేరుకుని రికార్డుల తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశమై విద్యార్థులు సమస్యలపై ఆరా తీశారు. బాలికలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని వార్డెన్‌ నాగ శకుంతలను ఆదేశించారు. ఏపీ గురుకుల పాఠశాలకు చేరుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ బుచ్చిబాబు ఉపాధ్యాయులతో సమావేశమై ఉపాధ్యాయుల పనితీరుపై చర్చించారు. అనంతరం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలలకు లేటుగా హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు వేడినీళ్లు అందజేయాలని, ఏఎన్‌ఎంల ఫోన్‌ నెంబర్లు సంబంధిత ప్రధానోపాధ్యాయుల వద్ద ఉండాలని, విద్యార్థులకు ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థికి హెచ్‌బి టెస్ట్‌ చేసి 6 శాతము తక్కువ ఉన్న విద్యార్థులకు దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు రోజుకు రెండు వేసే విధంగా పిడి, టీచర్లే బాధ్యత తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ఏ కారణం చేతనే వారి ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రోజులు అనుమతి ఇచ్చి మూడో రోజు పాఠశాలకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు వార్డెన్‌ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

➡️