మైక్‌ పని చేయకపోయినా పోలీసులపైనే నెపమా?

Mar 19,2024 23:58

మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి – సత్తెనపల్లిటౌన్‌ :
రాజకీయాల్లో అనైతికతకు మారుపేరు టిడిపి అధినేత చంద్రబాబు అని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభ నిర్వహణ వైఫల్యాలను ప్రభుత్వంపై నెట్లే యత్నం బాబు డోల్లాతనానికి నిదర్శనమని మండిపడ్డారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నడవలేక దారి వంకరగా అన్నట్లుగా చంద్రబాబు మాటలున్నాయని, సభ అట్టర్‌ప్లాప్‌ కావడాన్ని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజాగళంలో మైక్‌ పని చేయకపోతే దాన్ని కూడా పోలీస్‌ వైఫల్యం అంటూ బాబు అనటం విడ్డురంగా ఉందన్నారు. గతంలో ముగ్గురు కలసి పనిచేసి మళ్లీ ముగ్గురు కలసి తిట్టుకున్న సంగతి ప్రజలు మరచిపోలేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. తాము అధికారంలోకి వస్తే ముస్లిమ్‌ రిజర్వేషన్‌ బిల్లును రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. బాబు కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే ఈ ప్రమాదం ఉందనే విషయాన్ని ముస్లిములు గుర్తించాలని కోరారు.

➡️