మొదటి వారానికి టిడ్కో ఇళ్లు సిద్ధమా?

Jan 28,2024 21:45

ప్రజాశక్తి -సాలూరు : పట్టణ పేదలకు సంబంధించిన టిడ్కో ఇళ్ల పంపిణీ ఫిబ్రవరి మొదటి వారంలో చేయనున్నారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. రోడ్లు, సివరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణం వంటి పనులు ఇంత వరకు పూర్తి కాలేదు. మూడు రోజుల క్రితమే విద్యుద్దీకరణ పనులు ప్రారంభమయ్యాయి. రూ,.3కోట్లతో విద్యుద్దీకరణ పనులకు భూమిపూజ చేశారు. వారం రోజుల క్రితం టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ ఇళ్లను, మౌలిక సదుపాయాల పనులు పరిశీలించారు. వచ్చేనెల మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ చేపడతామని చెప్పారు. దీంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన చెప్పడం వరకు బాగానే ఉంది. పనులైతే మాత్రం యుద్ధప్రాతిపదికన జరుగుతున్న దాఖలాల్లేవు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు సుమారు వెయ్యి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటికి విద్యుద్దీకరణ పనులు పూర్తి కాలేదు. ఒక్కో బ్లాక్‌కు ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలి. వీటి నుంచి ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇవన్నీ పదిరోజుల్లో పూర్తి చేస్తామని ఎపిఇపిడిసిఎల్‌ అధికారులు చెబుతున్నారు. కానీ ఆదిశగా పనులు జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు.అసంపూర్తిగా ఇంటర్నల్‌ రోడ్లు ఊరు కాలుతున్న సమయంలో నుయ్యి తవ్విన చందంగా తయారైంది టిడ్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితి. ఫిబ్రవరి మొదటి వారంలో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా వున్నాయి. వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టిడ్కో ఇళ్ల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఎన్నికల ముందు పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో మొదటి వారంలో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని నిర్ణయించారు.ఇంజనీర్ల పర్యవేక్షణ కరువు టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ల నిర్మాణం పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఒక వైపు సిసి రోడ్డు అసంపూర్తిగా ఉంది. రెండోవైపు సిసి రోడ్డు నిర్మాణం ప్రాథమిక దశలో వుంది. సివరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణం 50శాతం కూడా పూర్తి కాలేదు. పనులు నత్తనడకన జరగడానికి కారణం టిడ్కో ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తోంది. ఇంజనీరింగ్‌ అధికారులు చైర్మన్‌ సహా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో కాంట్రాక్టరు పనులు నెమ్మదిగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణ కాంట్రాక్టరుకు సుమారు రూ.250 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పనులు త్వరితగతిన పూర్తి చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్లు గడిచిన పదేళ్ళుగా నిర్మాణదశలో ఉన్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టరును వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కొంత కాలయాపన జరిగింది.రూపాయి కే ఇంటి రిజిస్ట్రేషన్‌ టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించి టిడిపి, వైసిపి ప్రభుత్వాల మధ్య తేడా ఏమిటంటే గత ప్రభుత్వం రుణ సదుపాయం ద్వారా ఇళ్లను అందజేయనున్నట్లు తెలిపింది. వైసిపి ప్రభుత్వం రూపాయికే రూ.12లక్షల విలువైన ఆస్తిని పేదలకు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మొదటివారానికి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

➡️