మోడీని గద్దె దించకుంటే రైతు మెడకు ఉరితాడే

Mar 10,2024 23:34

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు, రైతులు
ప్రజాశక్తి – దుగ్గిరాల :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపిని గద్దె దించకుంటే రైతు మెడలకు నరేంద్ర మోడీ ఉరితాడవుతారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్‌ అన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 14న ఢిల్లీలో జరిగే భారీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కరపత్రాలను మండల కేంద్రమైన దుగ్గిరాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రైతులను బిజెపి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. సి2ప్లస్‌50 ప్రకారం పంటలకు మద్దతు ధర ప్రకటించాలనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని ఢిల్లీ రైతు పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా పరోక్షంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ధర లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతులు ఎన్నికల ముందు గుర్తుకొస్తారని, ఎన్నికల అనంతరం రైతులను పట్టించుకునే వారు ఉండరన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగింపును రద్దు చేయాలని, రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. మోడీని గద్దె దించాలని నినాదంతో ప్రతి మండల కేంద్రంలో మార్చి 14వ తేదీన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి మాట్లాడుతూ దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి వ్యవసాయ రంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గత 20 ఏళ్లలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడానికి మోడీ పూనుకున్నారని మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు మాట్లాడుతూ ఈనెల 14న జరిగే ఆందోళనల్లో రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతు సంఘం కన్వీనర్‌ వి.వెంకటరామయ్య మాట్లాడుతూ కొన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నా అవి అమలు కావడం లేదని, దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వె.ౖబ్రహ్మేశ్వరరావు, ఇ.శ్రీనివాసరావు, సిహెచ్‌ పోతురాజు, రైతులు ఎన్‌.చంద్రశేఖర్‌, ఎల్‌.శ్రీకాంత్‌, పి.రవికుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు.

➡️