‘యాదవులకు సముచిత స్థానం కల్పిస్తేనే మద్దతు’

Mar 10,2024 23:30

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : యాదవులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు పిఎంఆర్‌ సంస్థ చైర్మన్‌ బీద మస్తాన్‌రావు అన్నారు. కుంచనపల్లిలోని ఓ హోటల్లో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్‌ అధ్యక్షతన ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీలకు 10 సీట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీలకి అండదండలు ఉంటాయని అన్నారు. ప్రతి జిల్లాలో శ్రీకష్ణ మందిరం ఏర్పాటు చేయాలని, రాజధానిలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. వెంగళరావు యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో విద్యాపరంగా వెనుకబడిన పశువుల కాపరుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. యాదవ్‌ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని, రాబోయే ఎన్నికల్లో 25 అసెంబ్లీ, ఐదు పార్లమెంటు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మఠం ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలో శరభయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణదేవరాయలు యాదవ్‌ విగ్రహాలు తిరుమల కూడల్లో ఏర్పాటు చేయాలని కోరారు. దేవస్థానంలో యాదవులకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. యాదవులు పశువులు మేపుకోడానికి ప్రతి గ్రామంలో బంజర భూములను కేటాయించాలని కోరారు. సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్సీ స్వామి యాదవ్‌, టిటిడి పాలకమండలి సభ్యులు మెరుసు నాగసత్య, అఖిల భారతీయ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్‌, దానబోయిన సుందరరావు యాదవ్‌ పాల్గొన్నారు. అనంతరం ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన బిఎస్‌ఆర్‌ యాదవ్‌ని అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షునిగా, తిరుపతి జిల్లాకు చెందిన చిట్టిబోయిన శంకర్‌యాదవ్‌ను యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

➡️