యుద్ధం మొదలైంది

Dec 20,2023 22:54

 ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి, కోట, భోగాపురం  :  ‘యుద్ధం ఇప్పుడే మొదలైంది.. ఇది ముగింపు కాదు.. తాడేపల్లి ప్యాలెస్‌ గోడలు బద్దలు గొట్టే వరకూ ఆగదు’ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. భోగాపురం మండలం పోలిపల్లి సమీపాన నిర్వహించిన యువగళం-నవశకం విజయోత్సవ సభలో లోకేష్‌ మాట్లాడారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్ర, జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ చేపట్టిన వారాహి యాత్రతో సిఎం జగన్‌కు భయం పట్టుకుందన్నారు. సాగనిస్తే పాదయాత్ర అవుతుందని, లేదంటే దండయాత్ర అవుతుందని అన్నారు. అక్రమ అరెస్టులు, నిర్భందాలకు పాల్పడడంతో అదే చేసి చూపించానని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినా తప్పు ఉన్నట్టు తేల్చలేకపోయాడన్నారు. జగన్‌ను అరెస్ట్‌ చేస్తే ప్రతి కేసుకూ ఒక స్కామ్‌ బయట పడుతుందని అన్నారు. ఆడుకుందాం ఆంధ్రా అంటూ జగన్‌ ఇప్పుడు కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. ఇందులో ఆటగాళ్లంతా అవినీతి మరకలు అంటించుకున్నవారేనన్నారు. ఈఐదేళ్ల పాలనలో జగన్‌ ఎన్నో విధ్వాంశాలు సృష్టించాడని అన్నారు. తన పాతయాత్రలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. పేదలు చదువుకోసం, పొట్టకూటికోసం ఎదురు చూస్తున్నారని, రైతులు, నిరుద్యోగుల సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. 31మంది ఎంపిలు ఉండి కూడా విశాఖ ఉక్కు విక్రయాన్ని అడ్డుకోవడం లేదన్నారు. పైగా ఉక్కు భూములు కొట్టేసెందుకు చూస్తున్నారని, ఋషికొండకు గుండు కొట్టి దోచుకునేందుకు చూస్తున్నాడని విమర్శించారు. విశాఖలో తాను ఎన్నో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేశానని, జగన్‌ వచ్చాక ఉన్న పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పచ్చ బటన్‌ నొక్కి … మరో వైపు రెడ్‌ బటన్‌ నొక్కి ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, మద్యం ధరలు పెంచారని విమర్శించారు. జాబ్‌ కేలండర్‌ మాట తప్పి నిరుద్యోగులకు మోసం చేశారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా నిర్మించలేదని విమర్శించారు. సిపిఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేశారని, చివరికి వేతనాల్లో కోత పెట్టి పోలీసులకు కూడా మోసం చేశాడని అన్నారు. జగన్‌ పని అయిపోయిందని, అందుకే ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని అన్నారు. జగన్‌ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. లక్షకోట్లు దోచేసిన వ్యక్తి, ప్యాలెస్‌లో ఉంటున్న వ్యక్తి పేదవాడు అవుతాడా అని ప్రశ్నించారు. ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని, మూడు నెలల్లో ప్రజా స్వామ్యం పవర్‌ ఏంటో చూపాలని అన్నారు. కష్ట కాలంలో పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారని, యువగళం పాదయాత్ర లో ఎంతో మంది సహకరించారని అన్నారు.

జనసేన పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ టిడిపి, జనసేన కలిసి ముందుకు వెళ్తే ప్రజారంజకమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చిన కష్టకాలంలో జనసేన, టిడిపి కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నా యన్నారు. ఐటి అభివృద్ధి కుంటుబడటంతో నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్నారు. సంక్రాంతి లోపు చక్కటి మేనిఫెస్టో రూపొందించుకుంటామని, ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని చెప్పారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లడుతూ యువనేత లోకేశ్‌ పాదయాత్రకు సైకో జగన్‌ ఎన్నో ఆటంకాలు సృష్టించాడన్నారు. ఈ సభను చూసి జగన్‌ వెన్ను వణుకుతుందన్నారు. టిడిపి, జనసేన కలయికతో బలహీన వర్గాలను దూరం చేయడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రను విజయ సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలకు కట్టబెట్టారని విమర్శించారు. సిగ్గు ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలన్నారు. 100 రోజుల్లో వైసిపి బంగళాఖాతంలో కలిపితే తప్ప ప్రజలకు బతుకులేదన్నారు.

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వైసిపి అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్‌టిఆర్‌ ప్రభంజనం నెమరు వేసుకునేలా నేడు జన ప్రభంజనం కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టి గల నాయకుడన్నారు. ఇటీవల కాలంలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనూ, ప్రజా సేవలోనూ ఎక్కువగా ఉంటున్నారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు వేతనాలు కూడా సకాలంలో అందడం లేదన్నారు. కనకపు సింహాసనం మీద శునకం కూర్చున్నట్టుగా ఉందని సీఎం జగన్‌ను విమర్శించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు జగన్‌ మోసం చేశాడని అన్నారు.శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం చరిత్ర ఘట్టమన్నారు. ఇది ముగింపు కాదని, ఇప్పుడే ప్రారంభమైందని అన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. నవశకం ఊపు అందుకుందన్నారు. జనసేన నాయకులు పంచకర్ల రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి దశ దిశ చూపడానికి ఎన్ని అడ్డంకులు సష్టించినా పాదయాత్ర ముగింపు చేశారన్నారు. సభకు శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుల వర్ల రామయ్య అధ్యక్షత వహించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, మాజీ మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

చేతులెత్తేసిన వాలంటీర్లు

సభకు భారీగా టిడిపి, జనసేన కార్యకర్తలు తరలిరావడంతో వారిని నియంత్రించడంలో యువగళం వాలంటీర్లు చేతులెత్తేశారు. దీంతో పలుచోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. వేలాదిగా వచ్చిన వారిని నియంత్రణ చేయడంలో వాలంటీర్లు చేతులెత్తేశారు. బారికేడ్లు దూకి వచ్చిన వారిని నియంత్రించడంలో వాలంటీర్లకు సాధ్యం కాలేదు. సభ ముగింపు అనంతరం బయటకు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు అనేక అవస్థలు పడ్డారు. ట్రాఫిక్‌ స్తంభించిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

➡️